NTV Telugu Site icon

Andhra Pradesh: కేంద్రం గ్రీన్‌ సిగ్నల్.. కొప్పర్తి నుంచి బెజవాడకు ఎంఎస్ఎంఈ..!

Ap

Ap

Andhra Pradesh: కరువుతో అల్లాడుతోంది రాయలసీమ. కరువు సీమలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కోసం కడపకు కూత వేటు దూరంలోని కొప్పర్తిలో పారిశ్రామిక వాడను ఏర్పాటు చేశాయి గత ప్రభుత్వాలు. భారీ పరిశ్రమలు వస్తాయి నిరుద్యోగ సమస్య తీరుతుంది అని ఆశల పల్లకిలో ఊరేగుతున్న నిరుద్యోగ యువతకు ఎన్డీఏ ప్రభుత్వం చేదువార్త అందించింది. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏర్పాటు కానున్న ఎంఎస్ఎంఈ పరిశ్రమను విజయవాడలో ఏర్పాటు చేసేలా కేంద్రానికి ప్రభుత్వం నివేదికలు పంపిందట.. రాష్ట్ర రాజధాని అమరావతిలో దాదాపు 250 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ కంటెస్టింగ్ ఫెసిలిటీ ఏర్పాటుకు కేంద్రం కూడా ఆమోదం తెలిపిందట. రాజధాని ప్రాంతంలోని 20 ఎకరాల భూమిని సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖకు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందట. ప్రపంచ బ్యాంకు ఆధ్వర్యంలో విశాఖలో ఏర్పాటుచేసిన తొలి ఎంఎస్ఎంఈ టెక్నాలజీ ఇప్పటికే అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇదే తరహాలో గుంటూరు జిల్లాలో మరో సెంటర్ ఏర్పాటు చేయాలని నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది అట.

Read Also: World Environmental Health Day 2024: నేడే ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం.. ఎందుకు జరుపుకుంటారంటే.?

కడప నగరానికి అతి సమీపంలోని కొప్పర్తిలో 6914 ఎకరాలతో ఇండస్ట్రియల్ క్యారిడార్ ను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇక్కడ మధ్య చిన్న తరహా కంపెనీలతో కలిపి దాదాపు 30 కంపెనీలు తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్ కు రోడ్డు, విమాన, రైల్వే సౌకర్యాలు అతి సమీపంలో ఉండడంతో పరిశ్రమల ఏర్పాటు జరిగితే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని గత ప్రభుత్వాలు ఆలోచించాయట. అందులో భాగంగా వైసిపి ప్రభుత్వం కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఎం ఎస్ ఎం ఈ పరిశ్రమ ఏర్పాటు చేయాలని కేంద్రానికి నివేదికలు పంపిందట.. గత సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ పరిశ్రమను కడప నుంచి విజయవాడకు తరలిస్తున్నారట. ఎం ఎస్ ఎం ఈ టెక్నాలజీ సెంటర్ ద్వారా యువతకు ప్రపంచస్థాయి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ తో పాటు వివిధ ఇంజనీరింగ్ టెక్నాలజీ కోర్సులు డిప్లమా,, పోస్ట్ డిప్లమా, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమా ప్రోగ్రాములు అందిస్తారు. ఇటువంటి అత్యాధునిక టెక్నాలజీ కలిగిన సమస్త కడప కొప్పర్తి పారిశ్రామిక వాడ నుంచి విజయవాడకు తరలించడంపై నిరుద్యోగులు పెదవి విరిస్తున్నారు. అసలే కరువుతో అల్లాడుతున్న రాయలసీమలో భారీ పరిశ్రమల లేక ఉద్యోగాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న యువతకు ఇది చేదు వార్త అని రాజకీయ పార్టీలు సైతం దుమ్మెత్తి పోస్తున్నాయట. ఇకనైనా కూటమి ప్రభుత్వం భారీ పరిశ్రమలు కొప్పర్తి క్యారీడార్ లో ఏర్పాటు చేసి లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు అంటున్నారు.