మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షిగా ఉన్న గంగాధర్‌రెడ్డి హఠాన్మరణం చెందారు. అనంతపురం జిల్లా యాడికిలోని ఇంట్లో బుధవారం రాత్రి ఆయన మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా, నిద్రపోయిన సమయంలో అనారోగ్యంతోనే గంగాధర్‌రెడ్డి మృతిచెందినట్లు అతని కుటుంబసభ్యులు వెల్లడించారు.
ఇదిలా ఉంటే.. తనకు ప్రాణహాని ఉందంటూ గతంలో జిల్లా ఎస్పీని కలిసి గంగాధర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. సీబీఐ అధికారులు బెదిరించి ఏకపక్షంగా సాక్షం చెప్పంటున్నారని గతంలో ఎస్పీకి వెల్లడించారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకొని గంగాధర్ రెడ్డి మరణంపై తాడిపత్రి డీఎస్పీ చైతన్య ఆరా తీస్తున్నారు.