YCP Twitter Account Hacked: ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విటర్ అకౌంట్ హ్యాక్‌కి గురైంది. శుక్రవారం అర్థరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ అకౌంట్‌ను హ్యాక్ చేసిన దుండగులు.. క్రిప్టో కరెన్సీకి సంబంధించిన వివరాలతో పాటు కోతి ఫోటోలను షేర్ చేశారు. బయోలో ఎన్‌ఎఫ్‌టీ బిలియనీర్ అని రాసి ఉంది. బోర్డ్ ఏప్, ద మియామీ ఏప్‌కి సంబంధించిన ఖతాలు ట్యాగ్ ఉండటాన్ని గమనించవచ్చు. క్రిప్టో కరెన్సీకి సపోర్ట్ చేసేందుకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ముందుకు వచ్చాడన్న వార్తని సైతం షేర్ చేశారు. చివరగా.. ప్రధాని మోడీతో వీడియో కాన్ఫరెన్స్‌లో జీ-20 సన్నాహాకాలపై జగన్ మాట్లాడిన పోస్ట్ మాత్రమే ఉంది. ఆ తర్వాత మిగతావన్నీ క్రిప్టోకి సంబంధించిన పోస్టులే ఉన్నాయి. ప్రొఫైల్ పిక్‌తో పాటు కవర్ పిక్‌ని కూడా మార్చేశారు.
తమ ట్విటర్ ఖాతా హ్యాక్‌కి గురైందన్న విషయం తెలుసుకున్న వైసీపీ టెక్నికల్ బృందం.. వెంటనే రంగంలోకి దిగింది. తిరిగి ఖాతాను పొందేందుకు తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఈ ఘటనపై ట్విటర్ యాజమాన్యానికి కూడా వైసీపీ ఐటీ టీమ్ ఫిర్యాదు చేసింది. ఈ పనికి ఎవరు పాల్పడ్డారన్న పనిలోనూ నిమగ్నమైంది. ఎవరైనా స్థానిక రాజకీయ నాయకులే ఈ పనికి చేయించారా? లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా? అనే విషయంపై ఆరా తీస్తున్నారు.
