NTV Telugu Site icon

Yanamala: వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే మంత్రులతో రాజీనామాలు

Yanamala

Yanamala

ఏపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు మండిప‌డ్డారు. పాల‌నా వైఫ‌ల్యాల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకు వైసీపీ సర్కారు ప్రయ‌త్నిస్తోందని ఆరోపించారు. అందుకే కీలుబొమ్మ తరహాలో మంత్రి వ‌ర్గాన్ని బ‌లి ప‌శువును చేస్తున్నట్లు కనిపిస్తోంద‌న్నారు. మంత్రుల నుంచి సీఎం జ‌గ‌న్ ఎందుకు రాజీనామాలు కోరారో ప్రజ‌ల‌కు చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. అవినీతి బుర‌ద‌ను క‌డుక్కోవాలంటే ఈ రాజీనామాలు స‌రిపోవని యనమల వ్యాఖ్యానించారు. విధ్వంస‌క విధానాలు పాటిస్తోన్న జ‌గ‌న్ ప్రజ‌ల‌కు క్షమాప‌ణ‌లు చెప్పి ప‌ద‌వి నుంచి దిగిపోవాల‌ని డిమాండ్ చేశారు.

ప్రతిపక్షాన్ని మరింతగా బూతులు తిట్టే మంత్రులు కావాలని కెబినెట్లో మార్పులు చేర్పులు చేస్తున్నారా అంటూ యనమల ప్రశ్నించారు. ఇప్పటి వరకు జగన్ తన అపరిపక్వ, అవినీతి పాలనతో రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారని ఆరోపించారు. కొత్త కెబినెట్ కూర్పుతో జగన్ పదవీచ్యుతుడు కావడం ఖాయమన్నారు. వైసీపీని రాజకీయ బురద, అవినీతి, పతనం నుంచి బయట పడేసేందుకు కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ ఏ మాత్రం ఉపయోగపడదని యనమల పేర్కొన్నారు.

మరోవైపు గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం వైసీపీ ప్రభుత్వంలో మిథ్యేనని మాజీ మంత్రి యనమల విమర్శలు చేశారు. జగన్‌ చెబుతున్నదొకటి, చేస్తున్నది మరొకటిగా ఉందన్నారు. స్థానికసంస్థలను బలోపేతం చేస్తామంటూ సచివాలయాలను ఏర్పాటుచేసిన జగన్ ఆ సచివాలయాల్లో నిధులు లాక్కోవడం దుర్మార్గమని మండిపడ్డారు. గత మూడేళ్ల కాలంలో పంచాయతీలకు చెందిన రూ 11వేల కోట్ల విలువైన 14, 15 ఆర్థిక సంఘం నిధులను అక్రమంగా మళ్లించుకున్నారని యనమల ఆరోపించారు.

Andhra Pradesh: ఈనెల 11న ప్రమాణస్వీకారం చేసే మంత్రులు వీళ్లేనా?