Site icon NTV Telugu

Yanamala Ramakrishnudu : మూర్ఖంగా మరో చట్టం చేసినా ఇదే పరిస్ధితి

రాజధానిపై మరో చట్టం తీసుకురావటానికి వీల్లేదని హైకోర్టు ఇచ్చిన తీర్పులో స్పష్టంగా ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విభజన చట్టం ప్రకారం రాజధానిపై చట్టం చేసే హక్కు పార్లమెంటుకు ఉందిగానీ శాసనసభకు లేదని తీర్పులో స్పష్టంగా పేర్కొన్నారు. శాసన సభ రాజ్యాంగానికి లోబడి చట్టాలు చేయాలి తప్ప రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్టం చేసే అధికారం లేదని ఆయన వెల్లడించారు. రాజధానిపై మూర్ఖంగా మరో చట్టం చేసినా ఇదే పరిస్ధితి ఎదురవుతుందని, ఇకనైనా హైకోర్టు తీర్పును, ప్రజాభిప్రాయాన్ని గౌరవించి అమరావతిని అభివృద్ధి చేయాలని, మూర్ఖపు వైఖరితో అమరావతిని నిర్లక్ష్యం చేస్తే హైకోర్టు తీర్పును కించపరిచినట్లే అవుతుందన్నారు. వైసీపీకి అధికార బలం, అహంకార మదం ఉంది తప్ప ఆలోచన బలం లేదని ఆయన విమర్శించారు.

అభివృద్ది వికేంద్రీకరణ అంటే మూడు రాజధానులు కాదని, బడ్జెట్టును అన్ని ప్రాంతాలకు సమానంగా పంచి రాష్ట్రం అంతా అభివృద్ది చేయాలని ఆయన హితవు పలికారు. అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు నెలకొల్పి యువతకు ఉపాధి కల్పించాలని, మాట్లాడితే అభివృద్ది వికేంద్రకరణ అని కబుర్లు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. వైసీపీ 3 ఏళ్ల పాలనలో ఏం అభివృద్ది చేశారో ఏఏ ప్రాంతంలో ఏ పరిశ్రమలు నెలకొల్పారో చెప్పాలని, వైసీపీ అధికారంలోకి వచ్చాక విశాఖ నుంచి ఐటీ కంపెనీలు పరిశ్రమలు తరలిపోయాయన్నారు. కర్నూల్లో సోలార్ ప్లాంట్ ఆగిపోయిందని, అభివృద్ది వికేంద్రీకరణకు అర్థం కూడా తెలియకుండా అభివృద్ది వికేంద్రీకరణ గురించి వైసీపీ నేతలు మాట్లాడటం హాస్యాస్పదమన్నారు.

https://ntvtelugu.com/several-ips-officers-were-posted-in-hyderabad/
Exit mobile version