Site icon NTV Telugu

రాష్ట్రంలో జగన్ దుర్మార్గపు పాలన నడుస్తుంది: యనమల

రాష్ట్రంలో జగన్‌ దుర్మార్గపు పాలనకు తోడు పోలీసుల దౌర్జన్యం తోడైందని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ తీరును తీవ్రంగా విమర్శించారు. టీడీపీ నేత బుద్ధా వెంకన్న అరెస్టును ఆయన ఖండించారు. సమాజంలో అల్లర్లు సృష్టిస్తూ అరాచకాలు చేస్తున్న వైసీపీ గుండాలను వదలి టీడీపీ నేతలపై పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తమ నెత్తి మీద 3 సింహాలకు బదులు 3 ఫ్యాన్ రెక్కలు పెట్టుకోండంటూ మండిపడ్డారు.

Read Also: ఏపీ పోలీసులు ప్రజలవైపు ఉన్నారా.. వైపీసీ వైపు ఉన్నారా..?: నారాలోకేష్‌

వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కొడాలి నాని.. కొంతమంది వైసీపీ నేతలు టీడీపీ కార్యకర్తల్ని రెచ్చగొట్టేలా, సభ్యసమాజం తలదించుకునేలా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ యనమల అన్నారు. వారిపై ఏం చర్యలు తీసుకున్నారు? 3 ఏళ్లలో ఎంతమంది వైసీపీ నేతల్ని అరెస్ట్ చేశారో పోలీసులు చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చెప్పినట్టు విని డీజీపీ, డీజీపీ చెప్పినట్టు విని కొంతమంది పోలీసులు వారి భవిష్యత్‌ను వారే అంధకారంలోకి నెట్టుకుంటున్నారన్నారు. తక్షణమే బుద్ధా వెంకన్నను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

Exit mobile version