Site icon NTV Telugu

Wife Harassed By Husband: ప్రేమ పేరుతో ముంచేశాడు.. ఆ మహిళ ఏం చేసిందంటే?

Wife Attempts Suicide Palna

Wife Attempts Suicide Palna

Wife Attempt To Commit Suicide To Seek Justice Against Husband: మొదట ప్రేమన్నాడు.. తర్వాత పెళ్లి కూడా చేసుకుంటానన్నాడు.. నువ్వు లేకుండా నేను బ్రతకలేనని చెప్పాడు. దీంతో ఆ అమ్మాయి అతని ప్రేమను అంగీకరించింది.. తనని అమితంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి.. పెళ్లి చేసుకుంటే జీవితం సుఖమయంగా ఉంటుందని భావించింది. కానీ.. పెళ్లయ్యాక ఆమె ఆశలు నీరుగారిపోయాయి. అంతకుముందే అతనికి మరో మహిళతో వివాహైన సంగతి ఆమెకి తెలిసింది. దాంతో మోసపోయాయని గ్రహించిన ఆ మహిళ.. అతడ్ని నిలదీసింది. అప్పట్నుంచి అతడు ఆమెను చిత్రహింసలకు గురి చేయడం మొదలుపెట్టాడు. అది భరించలేక, ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..

మార్కాపురంకు చెందిన లక్ష్మీ అనే మహిళను కట్టా రమేశ్ అనే వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాడు కాబట్టి, తనని తన భర్త ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా సంతోషంగా చూసుకుంటాడని లక్ష్మీ ఆశించింది. కానీ, పెళ్లయ్యాక సీన్ రివర్స్ అయ్యింది. మొదట్లో కొన్ని రోజుల పాటు వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగింది కానీ, ఆ తర్వాత రమేశ్‌కు తనకంటే ముందే మరో మహిళతో వివాహం జరిగిందన్న విషయం లక్ష్మీకి తెలిసింది. అది జీర్ణించుకోలేకపోయిన లక్ష్మీ.. తనని ఎందుకు మోసం చేశావంటూ రమేశ్‌ని నిలదీసింది. అప్పట్నుంచి ఆమెకు వేధింపులు ప్రారంభమయ్యాయి. తాను చెప్పినట్టు పడుండాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ.. రమేశ్ ఆమెను రోజు చిత్రహింసలకు గురి చేయడం మొదలుపెట్టాడు.

అతని వేధింపులు భరించలేకపోయిన లక్ష్మీ.. తన భర్త నుంచి కాపాడాలని, తనకు న్యాయం చేయాలని కోరుతూ పోలీసుల్ని ఆశ్రయించింది. అయితే.. ఆ పోలీసులు కూడా అతనితో చేతులు కలిపి తనని వేధిస్తున్నారని లక్ష్మీ ఆరోపిస్తోంది. రక్షకులే ఆ రాక్షసుడితో చేతులు కలపడంతో.. తనకు న్యాయం జరగదన్న ఆవేదనతో లక్ష్మీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తద్వారా ఈ వ్యవహారం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులు ఈ కేసుని సీరియస్‌గా తీసుకొని, దర్యాప్తు చేపట్టారు.

Exit mobile version