Site icon NTV Telugu

అసలు ఎస్మా అంటే ఏంటి? ప్రభుత్వం ఎందుకు ప్రయోగిస్తుంది?

ఏపీ ప్రభుత్వం ఉద్యోగులపై ఎస్మా ప్రయోగిస్తుందన్న వార్తల నేపథ్యంలో అసలు ఎస్మా అంటే ఏంటో తెలియక చాలా మంది గూగుల్ సెర్చ్ చేస్తున్నారు. ఎసెన్షియల్‌ సర్వీసెస్‌ మెయింటెనెన్స్‌ యాక్ట్‌ అంటే అత్యవసర సేవల నిర్వహణ చట్టాన్ని ఎస్మా అంటారు. సమ్మెలు, బంద్‌ల వల్ల ప్రజల దైనందిన జీవనానికి ఇబ్బంది కలగకుండా చూడటం, కొన్ని రకాల అత్యవసర సేవల నిర్వహణ ఆటంకం లేకుండా కొనసాగేలా చూడటం కోసం 1981లో ఈ చట్టం రూపొందించారు.

Read Also: ఉద్యోగులకు షాక్.. ఎస్మా ప్రయోగించిన ఏపీ ప్రభుత్వం

అత్యవసర సేవలు అందించే ఉద్యోగులు తమ విధులకు హాజరుకాకుండా ఆయా సేవలకు విఘాతం కలిగేలా సమ్మె చేస్తే ఎస్మా ప్రయోగించే అధికారం ప్రభుత్వాలకు ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులందరూ ఈ చట్టం పరిధిలోకి వస్తారు. ఈ చట్టాన్ని ఒకసారి ప్రయోగిస్తే ఆరు నెలలపాటు అమల్లో ఉంటుంది. దాన్ని ఒక్కోసారి పొడిగిస్తుంటారు కూడా. ఈ చట్టం ప్రకారం సమ్మె చేస్తున్న ఉద్యోగులపై చర్యలు తీసుకోవచ్చు. సస్పెన్షన్‌, డిస్మిస్‌, జైలు శిక్ష, జరిమానా విధించే హక్కు ప్రభుత్వాలకు ఉంటుంది. ఒకవేళ ఈ చట్టాన్ని అతిక్రమించి సమ్మెకు దిగితే పోలీసులు వారంట్ లేకుండానే అరెస్టు చేయవచ్చు. డిస్మిస్ చేయడంతో పాటు క్రమశిక్షణా చర్యలు తీసుకోవచ్చు. 2003 తమిళనాడులో జయలలిత సర్కారు ఎస్మా ప్రయోగించి 1.70 లక్షల ఉద్యోగులను విధుల్లో నుంచి తప్పించింది.

Exit mobile version