NTV Telugu Site icon

Ban on Public Meetings and Rallies: రోడ్లపై సభలు, ర్యాలీలపై నిషేధం.. సీఎం జగన్‌ అసలు టార్గెట్‌ అదేనా..?

Ys Jagan

Ys Jagan

ఏపీ సర్కార్‌ సంచలన నిర్ణయం తీసుకుంది.. రోడ్లపై సభలు, ర్యాలీలను నిషేధించింది.. ప్రజల భద్రత దృష్ట్యా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.. జాతీయ, రాష్ట్ర, పంచాయతీ రాజ్, మున్సిపల్ రోడ్లపై ఈ నిబంధనలు వర్తించనున్నాయి. ప్రత్యామ్నాయ ప్రదేశాలు ఎంపిక చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.. రోడ్లకు దూరంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే ప్రదేశాలు ఎంపిక చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. ఎంపిక చేసిన ప్రదేశాల్లోనే సభలకు షరతులతో కూడిన అనుమతి ఇవ్వాలని స్పష్టం చేసింది.. ఇక, షరతులు ఉల్లంఘిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొంది.. ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్‌ హోంశాఖ. అయితే, జగన్‌ సర్కార్‌ తీసుకున్న ఈ నిర్ణయంపై విమర్శలు మొదలయ్యాయి.. సర్కార్‌ నిర్ణయంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ర్యాలీలు, సభల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి.. నిబంధనలు తీసుకురావాలి.. కానీ, ఇలా నిషేధం విధించడం ఏంటి? అని నిలదీస్తున్నారు. అయితే, జగన్‌ సర్కార్‌ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక.. రాజకీయ అజెండా కూడా ఉందనే చర్చ సాగుతోంది.. రాబోయేది ఎన్నికల సీజన్‌.. సభలు, సమావేశాలు, ర్యాలీలు, పాదయాత్రలు.. ఇలా రాష్ట్రంలో హోరెత్తనున్నాయి.. దీంతో, వారికి చెక్‌ పెట్టేందుకు సీఎం ఇలాంటి అస్త్రం వదిలారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బాదుడే బాదుడు, ఇదేం కర్మ లాంటి పేర్లతో స్ట్రీట్‌ మీటింగ్‌లు నిర్వహిస్తున్నారు.. కందుకూరు, గుంటూరులో జరిగిన కార్యక్రమాల్లో 11 మంది ప్రాణాలు కోల్పోవడంపై పెద్ద దుమారమే రేగింది.. ఈ నేపథ్యంలోనే కఠిన నిర్ణయాలు తీసుకున్నట్టు చెబుతున్నాయి ప్రభుత్వ వర్గాలు.. మరోవైపు, విపక్షాలను కట్టడి చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తుంది అంటున్నారు రాజకీయ నేతలు.. జనసేన అధినేత పవన్‌ కల్యాన్‌, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌.. ఇతర రాజకీయ నేతలు కూడా ఏదో ఓ తరహాలో యాత్రలకు సిద్ధం అవుతున్నారు.. జనవరి 27న కుప్పం నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు నారా లోకేష్‌.. యువగళం’ పేరుతో సాగనున్న ఈ పాదయాత్ర 400 రోజులు 4 వేల కిలోమీటర్లు సాగనుంది.. 100 నియోజకవర్గాల గుండా కొనసాగనుంది.. ఇక, పవన్‌ కూడా యాత్రకు సిద్ధం అవుతున్నారు.. జనసేనాని ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు రూట్ మ్యాప్ క్లియర్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ప్రచార రథం వారాహి అన్ని హంగులతో ఇప్పటికే రెడీగా ఉంది. త్వరలోనే పవన్‌ జనంలోకి వెళ్లేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నారు.. ఇలాంటి సమయంలో సర్కార్‌ తీసుకొచ్చిన నిషేధం.. వారి యాత్రలపై ఎలాంటి ప్రభావం చూపనుంది..? మన నేతలు ఎలా ముందుకు వెళ్లనున్నారు? అనేది ఆసకర్తికరంగా మారింది.

Read Also: Delhi Road Accident: ఢిల్లీ యాక్సిడెంట్ కేసులో మరో ట్విస్ట్.. స్కూటీపై మరో యువతి కూడా..

సర్కార్‌ నిర్ణయంపై సీరియస్‌గా స్పందించారు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు.. సభలు, ర్యాలీల నియంత్రణపై అర్ధరాత్రి ఇచ్చిన తుగ్లక్ జీవో నాలుక గీసుకోవటానికి కూడా పనికి రాదన్నారు. ఇవాళ సభలు ఎక్కడ పెట్టాలో చెప్తున్నవారు, రేపు ఆ సభల్లో ఎం మాట్లాడాలో కూడా తాడేపల్లి స్క్రిప్ట్ రాసిస్తారా ? అని ఎద్దేవా చేశారు. మేమైతే తగ్గేదెలే, యథావిథిగా సభలు, ర్యాలీలు నిర్వహించి తీరుతామని ప్రకటించిన ఆయన.. సభలు, ర్యాలీలు నియంత్రించాలని చూడటం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అవుతుందన్నారు. ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పాటైన ప్రజాస్వామ్య పరిరక్షణ వేదికను అడ్డుకునే చర్యలు న్యాయబద్ధంగానే ఎదుర్కొంటాం అని ప్రకటించారు. చీకటి జీవో అమలు చేయాలనుకునే అధికారులు నేటి సీఎం తూర్పు గోదావరి పర్యటనను అడ్డుకోవాలి.. ఇవాళ రాజమండ్రిలో సీఎం రోడ్డు షోకు ఎలా అనుమతులిచ్చారు? అని ప్రశ్నించారు. తామనుకున్నట్లు చేయటానికి ఇదేం రాజారెడ్డి రాజ్యాంగం కాదు.. ఒక పార్టీ గొంతు నొక్కటానికి అన్ని పార్టీల మెడకు ఉరి బిగిస్తున్నారు అని ఫైర్ అయ్యారు. త్వరలోనే విశాఖ వేదికగా ప్రజాస్వామ్య పరిరక్షణ సమావేశం నిర్వహిస్తాం.. విశాఖ సమావేశంలో కార్యాచరణ వివరిస్తామని పేర్కొన్నారు బోండా ఉమ.

ఇక, రోడ్లపై సభలు.. సమావేశాల నిర్వహణ విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో సరైంది కాదన్నారు బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి.. దుర్ఘటనలు జరగ్గకుండా ప్రభుత్వం జాగ్రత్త తీసుకోవాలి.. తగిన ఏర్పాట్లు చేయాలి.. రాజకీయ పార్టీలకు సభలు నిర్వహించుకునే అనుమతులివ్వాలి.. దానికి తగ్గ గైడ్ లైన్స్ జారీ చేయాలి.. కానీ, నిషేధం ఏంటి? అని ప్రశ్నించారు. అధికార పార్టీకి ఓ రకంగా.. ప్రతిపక్షాలకు ఓ రకంగా వ్యవహరించకూడదని హితవుపలికారు.. మరోవైపు.. ఈ పరిణామాలపై తప్పుబట్టారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. ర్యాలీలు, సభలు, సమావేశాలు, రోడ్ షోలు జరపకూడదని జీవో ఇవ్వటం దుర్మార్గమన్న ఆయన.. జగన్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందన్నారు. కందుకూరు, గుంటూరు ప్రమాద ఘటనలను సాకుగా చూపి జగన్ సర్కార్ తీసుకున్న నిరంకుశ నిర్ణయం.. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణాలు మానుకుంటారా..? అని నిలదీశారు.. ప్రజా ఉద్యమాలను, ప్రశ్నించే గొంతుకలను, ప్రతిపక్షాలను అణచివేసే కుట్రలో భాగమే 1861 పోలీస్ యాక్ట్ ఉత్తర్వులన్న ఆయన.. ప్రత్యేక పరిస్థితుల్లో సభలు పెట్టుకునేందుకు అనుమతి ఇస్తామంటున్నారు.. వైసీపీ శ్రేణులకు మాత్రమే ప్రత్యేక పరిస్థితులు వర్తిస్తాయా? అని మండిపడ్డారు. మొత్తంగా.. జగన్‌ సర్కార్‌ తీసుకున్న తాజా నిర్ణయంతో.. విపక్షాల కార్యక్రమాలపై ఎలాంటి ప్రభావం పడనుంది.. వైసీపీ కార్యక్రమాలు ఎలా సాగుతాయి? అనే ఆసక్తికరంగా మారింది.

Show comments