Deputy CM Pawan Kalyan: డిప్యూటీ సీఎం పదవి చేపట్టిన నాటినుంచి గ్రామాల అభివృద్ది విషయంలో దూకుడుమీదున్న పవన్ కల్యాణ్.. తన కుటుంబ మూలాలున్న పశ్చిమ గోదావరి జిల్లాపై ఇప్పుడు ఫోకస్ పెట్టారు. చిన్నతనంలో పవన్ పెరిగిన ప్రాంతాలైన మొగల్తూరు, పెనుగొండ గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇప్పటికే తన పేషీ అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశాలిచ్చారు. దీంతో, మొగల్తూరు, పెనుగొండ గ్రామాల అభివృద్ధికి కోసం ఈ నెల 28న గ్రామ అభివృద్ధి సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 28వ తేదీ ఉదయం మొగల్తూరు, సాయంత్రం పెనుగొండల్లో గ్రామలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేషి అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించనున్న అభివృద్ధి సభల్లో గ్రామస్తులు, అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. ఆయా గ్రామాలకు కావల్సిన అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనపై చర్చించి వాటిపై దృష్టిపెడతారు. అదే సమయంలో అయా గ్రామాల్లో ఉన్న వివిధ సమస్యలపై ప్రజలు ఇచ్చే అర్జీలను సైతం అధికారులు స్వీకరించి వాటి పరిష్కారంపై దృష్టిపెడతారు.
Read Also: CM Revanth Reddy : తెలంగాణలో ఉపఎన్నికలపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
తమ గ్రామాలకు సంబంధించి పవన్ కల్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టారని.. అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులకు చెప్పుకునే అవకాశం రావడంతో పెనుగొండ, మొగల్తూరు గ్రామానికి చెందిన ప్రజలు వివిధ సమస్యలను వారి దృష్టికి తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా పెనుగొండ గ్రామానికి సంబంధించి డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం, అగ్ని ప్రమాదాలు సంభవించిన సమయంలో అవసరమైన ఫైర్ ఇంజన్లు అందుబాటులో లేకపోవడం, ఇతర మౌలిక వసతుల కల్పన అంశాలపై డిప్యూటీ సీఎం పేషీ అధికారులకు విన్నవించేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే సమయంలో పెనుగొండ గ్రామానికి సంబంధించి ఉన్న సమస్యలు అన్నింటిని అధికారుల దృష్టికి తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్కరు సభకి హాజరుకావాలని ఇప్పటికే జనసేన నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు.. మరోవైపు మొగల్తూరు గ్రామంలో ఎప్పటి నుంచో ఇబ్బందికరంగా ఉన్న డ్రైనేజీ, రహదారుల విస్తరణ వంటి అంశాలతో పాటు పర్యాటకంగా ప్రాంతంలో అభివృద్ధి చేయడానికి ఉన్న అవకాశాలపై పేషే అధికారులకు విన్నవించేందుకు సిద్ధమవుతున్నారు. వర్షాకాలంలో మురుగునీరు నేరుగా పంట కాలవల్లోకి చేరుతున్న పరిస్థితిపై అక్కడే రైతులకు జరుగుతున్న నష్టాన్ని వివరించేందుకు రైతుల సైతం సిద్ధమవుతున్నారు.
Read Also: Jagadish Reddy : రాష్ట్రా ఆదాయం తగ్గింది.. మంత్రుల ఆదాయాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి
ఇక, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతో 28వ తేదీన మొగల్తూరు, పెనుగొండ గ్రామాలలో నిర్వహించబోయే సభల్లో ప్రజలు ఏఏ సమస్యలను ఎక్కువగా ప్రస్తావించే అవకాశం ఉందో.. ఆయా సమస్యల పైన స్థానిక అధికారులు ఇప్పటికే నివేదిక సిద్ధం చేసుకుంటున్నారు. ఇంతకాలం సమస్యలు అపరిష్కృతంగా ఉండడానికి కారణాలు ఏంటి, భవిష్యత్తులో ఆయా గ్రామాల్లో చేయబోయే అభివృద్ధి పనులు ఏంటి..? అనే అంశాలను మరింత లోతుగా ఆరా తీస్తున్నారు. పవన్ సొంత జిల్లా కావడంతో భవిష్యత్తులో ఈ జిల్లాలోని మరిన్ని గ్రామాలపై ఆయన ఫోకస్ పెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు జరగబోయే సభల్లో జనం ప్రస్తావించే సమస్యలు ఇతర ప్రాంతాల్లో రిపీట్ కాకుండా చూసుకునేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకునే అవకాశం ఉంది.