Andhra Pradesh: ఏపీలో మరో ఉద్యమం పురుడు పోసుకుంటోంది. రీసర్వే పనుల్లో ప్రభుత్వం తెస్తున్న ఒత్తిడిపై ఏపీ వీఆర్వోలు ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ఈ నెల 12 తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వీఆర్వోలు వెల్లడించారు. భోజన విరామ సమయంలో తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈ సందర్భంగా వీఆర్వోల సంఘం నేత భూపతిరాజు రవీంద్రరాజు మాట్లాడుతూ.. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ మాత్రమే తాము విధులు నిర్వర్తిస్తామని తెలిపారు. వంద రోజుల్లో రీసర్వే పూర్తి చేయాలంటూ ప్రభుత్వం తమకు టార్గెట్లు విధించడం సరైంది కాదన్నారు. రీసర్వే ప్రక్రియలో వీఆర్వోల చేత ప్రభుత్వం ఖర్చులు పెట్టిస్తోందని ఆరోపించారు.
Read Also: Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా జడేజా భార్య.. ఈనెల 12న ప్రమాణం
ఇప్పటి వరకూ పూర్తయిన పనులకు సంబంధించిన బిల్లులను ప్రభుత్వం మంజూరు చేయడం లేదని వీఆర్వోల సంఘం నేత భూపతిరాజు రవీంద్రరాజు విమర్శలు చేశారు. వీఆర్ఏల నుంచి వీఆర్వో గ్రేడ్ -2గా పనిచేస్తున్న వారికి ప్రొబెషన్ డిక్లేర్ చేయాలన్నారు. సచివాలయాల్లో పౌర సేవలు అందిస్తున్నా కనీసం స్టేషనరీ కూడా అందించడం లేదన్నారు. రీసర్వే ప్రక్రియలో రోజుకు 30 ఎకరాలు పూర్తి చేయాలన్న టార్గెట్ పెట్టడం ఏంటని ప్రశ్నించారు. పకడ్బందీగా చేయాల్సిన రీసర్వే.. టార్గెట్ల కారణంగా తప్పులు తడకలుగా తయారవుతోందన్నారు. రీసర్వే ఒకవైపు ఇతర విధులు మరోవైపు అప్పగించటం వల్ల బయోమెట్రిక్ హాజరు కూడా వేయలేకపోతున్నామని భూపతిరాజు అన్నారు.
