ఆంధ్రా భద్రాచలంగా పేరుగాంచిన ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు కడప నగర శివార్లలోని చిరు వ్యాపారుల పాలిట శాపంగా మారాయి. వీఐపీల రాక సందర్భంగా ప్రభుత్వ స్టల్లాల్లోని దుకాణాల తొలగింపుపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఎన్నో ఏళ్లుగా చిరువ్యాపారాలు చేస్తున్న దుకాణాలను అధికారులు తొలగించే యత్నాలను అక్కడి వ్యాపారులు నిరాశిస్తున్నారు. ఉన్నపళంగా దుకాణాలు తెసేయమంటే మా పరిస్థితి ఏంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు.
కమలాపురం రోడ్డు లోని విమానాశ్రయం నుంచి కడప నగరంలోకి వచ్చే మార్గంలో అలాంఖాన్ పల్లె ఇర్కాన్ సర్కిల్ లో ఉన్న చిరు వ్యాపారులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఎన్నో ఏళ్ళుగా చిరు వ్యాపారాలు చేస్తూ, కుటుంబాలను పోషించుకుంటున్న తమను ఖాళీ చేయాలని చెప్పడాన్ని వారు నిరసిస్తున్నారు. విమానాశ్రయం నుంచి కడప నగరానికి వచ్చే వీఐపీల రాక కోసం తమ దుకాణాలు అడ్డుగా ఉన్నాయనే నెపంతో అధికారులు తొలగించాలనే ప్రయత్నాలు చేయడం భావ్యం కాదన్నారు.
ఈ నెల 15న ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణం, 16న కడప నగర మేయర్ ఇంట్లో వివాహానికి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖులు హాజరు అవుతున్నారు. దీంతో ఎయిర్ పోర్టు నుంచి నగరంలోకి వచ్చే మార్గరంలోని ఇర్కాన్ సర్కిల్లో అనేక చిరు వ్యాపార దుకాణాలు ఉన్నాయి. అవి రోడ్డుకు అనుకుని ఉండటంతో వీఐపీల ప్రోటోకాల్, ఏర్పాట్ల నిబంధనల ప్రకారం ఉండకూడదని అధికారులు తొలగించే చర్యలకు పూనుకున్నారు. దీనిపై స్థానిక వ్యాపారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దుకాణాల నిర్వహణకు సంబంధించి అన్ని పన్నులు చెల్లిస్తున్నామని, వీఐపీల కోసం ఇలా తమ జీవితాలను కష్టాల్లో నెట్టడం ఏమిటని చిరు వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. గత 25 ఏళ్లుగా ఇక్కడే చిరు వ్యాపారం చేసుకుంటూ బ్రతుకు తెరువు కొనసాగిస్తున్నామని చిరు వ్యాపారులు అంటున్నారు. ఇందుకు సంబంధించి దుకాణాలకు కరెంటు బిల్లులు, ఇంటి పనులు చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పుడు చిరు దుకాణాలను కూల్చివేస్తామని అధికారులు బెదిరించడం భావ్యం కాదని వారు వాపోతున్నారు. మా వ్యాపారాలు పోతే మా బ్రతుకులు రోడ్డు పాలవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. చిరు దుకాణాలను తొలగిస్తే ఆత్మహత్యలే శరణ్యమని అధికారులను వేడుకుంటున్నారు.
