MLA Lokam Naga Madhavi: మొంథా తుఫాన్ విషయంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకున్నా.. భారీగానే నష్టం వాటిల్లింది.. అయితే, ఏ ఒక్క తుఫాన్ బాధితుడికి నష్టం జరగకుండా చూడాలని.. ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్కరికి సాయం అందాలని ప్రభుత్వ పెద్దలు ఆదేశిస్తున్నా.. కింది స్థాయిలో పరిస్థితి వేరేలా ఉంది అనిపించేలా కొన్ని ఘటనలు కనపిస్తున్నాయి.. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం జనసేనా ఎమ్మెల్యే లోకం నాగమాధవికి మత్స్యకారులు చుక్కలు చూపించారు. తుఫాన్ ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పూసపాటిరేగ మండలంలోని కోనాడ గ్రామ మత్స్యకారుల వద్దకు రేషన్ పంపిణీ చేయడానికి వెళ్లిన జనసేన నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవిపై అక్కడ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Toyota Camry: టయోటా క్యామ్రీలో సాంకేతిక లోపం.. 2,257 యూనిట్లు రీకాల్..
రేషన్ పంపిణీలో వ్యత్యాసాలు ఉన్నాయని, అందరికీ ఒకేలా సరుకులు ఇవ్వడం లేదని మండిపడిన మహిళలు ఎమ్మెల్యేను నిలదీశారు. తుఫాన్ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న సహాయక చర్యలు సరైన విధంగా లేకపోవడం పట్ల కూడా స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పర్యటనకు వచ్చినప్పటికీ తమ సమస్యలను పట్టించుకోకపోవడం, రేషన్ పంపిణీని సమానంగా నిర్వహించకపోవడం పట్ల మత్స్యకార మహిళలు గట్టిగానే ప్రశ్నించడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో లోకం మాధవి అక్కడి నుంచి వెనుదిరిగారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో లోపాలు ఉన్నాయంటూ మత్స్యకారుల విమర్శలు చేస్తున్నారు.
