Union Minister Rammohan Naidu: భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రధాన వనరుగా మారనుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, ఎస్పీ ఎ. ఆర్. దామోదర్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే లోకం మాధవి, మార్క్‌ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తిలతో కలిసి విమానాశ్రయ నిర్మాణ పనులను పరిశీలించారు. తరువాత మీడియాతో మాట్లాడుతూ, రెండు నెలల క్రితం 86.61 శాతం పనులు పూర్తయితే, ప్రస్తుతం 91.70 శాతం పూర్తి అయినట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు నిర్దేశించిన డెడ్‌లైన్ డిసెంబర్ 2026 కంటే ముందుగానే — వచ్చే ఏడాది జూన్ నాటికి విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నామని వెల్లడించారు. మిగిలిన 8.3 శాతం పనులను వేగంగా పూర్తి చేస్తామని, డిసెంబర్ లేదా జనవరిలో వాలిడేషన్ ఫ్లైట్ నిర్వహించనున్నట్లు చెప్పారు.
Read Also: Indian Business Icons: పతనం అంచున ఉన్న కంపెనీకి ప్రాణం పోశాడు.. : గోపీచంద్ హిందూజా
భోగాపురం ప్రాజెక్ట్ ప్రారంభం తర్వాత స్థానిక యువతలో ఆలోచనా దిశ మారిందని, రియల్ ఎస్టేట్ సహా పలు రంగాలు వృద్ధి చెందుతున్నాయని తెలిపారు. విమానాశ్రయం పూర్తయిన తర్వాత ఉత్తరాంధ్రలో ఆర్థికాభివృద్ధి గణనీయంగా పెరుగుతుందని చెప్పారు. స్థానికంగా ఏవియేషన్ యూనివర్సిటీ స్థాపనపై సీఎం చంద్రబాబు ఆలోచిస్తున్నారని వివరించారు. ప్రధాని నరేంద్ర మోడీ మార్గదర్శకత్వంలో దేశవ్యాప్తంగా అనేక విమానాశ్రయాలు ఏర్పడుతున్నాయని, వాటికన్నా అధిక వృద్ధిని భోగాపురంలో చూడబోతున్నామని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు ఈ విమానాశ్రయం బూస్ట్ అవుతుందని చెప్పారు రామ్మోహన్ నాయుడు. విమానయాన శాఖ నావిగేషన్, ట్రాఫిక్ కంట్రోల్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి అంశాలను నిరంతరం సమీక్షిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే పలు ఎయిర్‌లైన్ సంస్థలతో చర్చలు జరిపామని, ఆకాసా, స్పైస్‌జెట్, ట్రూజెట్ సేవలను కూడా ఇక్కడి నుండి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. భోగాపురంలో 15 బిలియన్ డాలర్ల వ్యయంతో ఏర్పడుతున్న గూగుల్ డేటా సెంటర్ ప్రారంభం తర్వాత స్థానికంగా కనెక్టివిటీ, ఇన్‌ఫ్రా అవసరాలు తీరుతాయని తెలిపారు. 14, 15 తేదీల్లో జరగనున్న విశాఖ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో విమానయాన శాఖ తరఫున ప్రత్యేక ప్రెజెంటేషన్ సిద్ధం చేసినట్లు తెలిపారు.
ఏవియేషన్ రంగానికి సంబంధించి భోగాపురం, శ్రీకాకుళం జిల్లాల్లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. భోగాపురం విమానాశ్రయాన్ని అల్లూరి సీతారామరాజు పేరుతో ప్రారంభించనున్నామని, ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించనున్నట్లు చెప్పారు. “ఉత్తరాంధ్ర సంస్కృతి ప్రతిబింబించేలా, ప్రపంచం గర్వించేలా భోగాపురం విమానాశ్రయం అవతరిస్తుంది. ఈ ప్రాజెక్ట్ ఉత్తరాంధ్ర గౌరవానికి ప్రతీకగా నిలుస్తుంది” అని రామ్మోహన్ నాయుడు అన్నారు.
