AP Horror: మాఫియాలో చేరాలని ప్లాన్‌.. స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు.. బంగారంతో పరారీ

Crime

Crime

ఆంధ్రప్రదేశ్‌లోని రాజాం పరిధిలో జరిగిన ఓ దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. కన్న కొడుకే తల్లిని కిరాతకంగా హత్య చేయడం స్థానికులను షాక్‌కు గురి చేసింది. తల్లి తనపై ఆంక్షలు పెడుతుందనే కారణంతో మైనర్ బాలుడు తన స్నేహితుడితో కలిసి ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా రాజాం మున్సిపాలిటీ పరిధిలోని డోలపేటలో నివసిస్తున్న ముంజేటి సతీష్ విధులు ముగించుకుని ఇంటికి చేరుకోగా, ఇంట్లో భార్య కనిపించకపోవడంతో పాటు వస్తువులు చిందరవందరగా ఉండటాన్ని గమనించాడు. దొంగతనం జరిగి ఉండొచ్చని భావించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అనంతరం భార్య కోసం చుట్టుపక్కల వెతకగా, ఇంటి పక్కనే ఉన్న పొదల్లో ఆమె మృతదేహం కనిపించింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్థానికులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంతో కలిసి ఆధారాలు సేకరించారు. ఇదే సమయంలో, 10వ తరగతి పూర్తి చేసిన మృతురాలి కుమారుడు కనిపించకపోవడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు విచారణలో విస్తుపోయే నిజాలను బయటపెట్టారు. పోలీసుల వివరాల ప్రకారం.. మృతురాలు స్పందన తన కుమారుడిపై క్రమశిక్షణ పేరుతో తరచూ ఆంక్షలు విధించేదని తెలుస్తోంది. దీనిపై అతడు తన స్నేహితుల వద్ద అసంతృప్తిని వ్యక్తం చేసేవాడు. ఇదే సమయంలో క్రికెట్ ఆడే సమయంలో మరో ఇంటర్మీడియట్ విద్యార్థితో పరిచయం ఏర్పడింది. ఆ విద్యార్థి కూడా కుటుంబ సమస్యలతో ఇంటి నుంచి దూరంగా ఉంటున్నట్లు తెలిసింది. ఇద్దరూ తమ సమస్యలను పంచుకుంటూ స్నేహితులయ్యారు.

క్రమంగా వారు తల్లిదండ్రులను హత్య చేసి ముంబైకి పారిపోయి అక్కడ మాఫియాలో చేరాలని ప్రణాళిక రచించినట్లు పోలీసులు తెలిపారు. పథకం ప్రకారం ఘటన జరిగిన రోజు ఇద్దరూ ఇంటికి చేరుకుని బాత్రూంలో దాక్కొన్నారు. స్పందన ఇంటికి వచ్చి బాత్రూంకు వెళ్లగానే ఆమెపై దాడి చేశారు. ముందుగా గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించినా, ఆమె తప్పించుకునేందుకు యత్నించడంతో మారణాయుధాలతో దాడి చేసి కిరాతకంగా హత్య చేశారు. హత్య అనంతరం రక్తపు ఆనవాళ్లు తుడిచేసి, మృతదేహాన్ని ఇంటి పక్కనున్న చెరువులో పడేసినట్లు విచారణలో తేలింది. అనంతరం ఇంట్లో ఉన్న సుమారు తొమ్మిది తులాల బంగారం, రూ.5 వేల నగదును తీసుకుని పరారయ్యారు.

రాజాం నుంచి బయలుదేరిన ఈ ఇద్దరు బాలురు ముందుగా మందస ప్రాంతానికి వెళ్లి అక్కడి నుంచి విశాఖపట్నం, ముంబై తదితర ప్రాంతాల్లో తిరిగారు. చివరకు తిరుపతి చేరుకున్నారు. తమ ఫోన్లలో సిమ్ కార్డులను తొలగించి వైఫై ద్వారా ఇన్‌స్టాగ్రామ్ వినియోగిస్తున్న సమయంలో పోలీసులు వారి ఆన్లైన్ కార్యకలాపాలను ట్రాక్ చేసి తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరూ మైనర్లు కావడంతో జువైనల్ హోంకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన సమాజంలో పెరుగుతున్న మానసిక అస్థిరత, విలువల కొరతపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. సరైన అవగాహన, నైతిక విలువలు, కుటుంబ బంధాల ప్రాధాన్యతపై విద్యార్థుల్లో చైతన్యం పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.