విశాఖపట్నం సాగరతీరం మరోసారి అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లో నిలుస్తోంది. భారత నౌకాదళం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష’ (IFR-2026) ఆదివారం నాడు వైభవంగా ప్రారంభమైంది. దేశ చరిత్రలో మూడోసారి నిర్వహిస్తున్న ఈ మెగా ఈవెంట్‌కు విశాఖపట్నం రెండోసారి వేదిక కావడం విశేషం. సరిగ్గా దశాబ్దం క్రితం, అంటే 2016లో ఇక్కడ జరిగిన ఐఎఫ్‌ఆర్ తర్వాత మళ్ళీ 2026లో అదే నగరాన్ని ఎంపిక చేయడం ద్వారా విశాఖ ప్రాధాన్యతను నౌకాదళం మరోసారి చాటిచెప్పింది. నేటి నుండి ఫిబ్రవరి 25వ తేదీ వరకు పది రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో సుమారు 50 దేశాల నుండి 4000 మంది అతిథులు , 70కి పైగా అత్యాధునిక యుద్ధనౌకలు పాల్గొంటున్నాయి. ఈ పది రోజులు విశాఖ నగరం ధవళ వస్త్రధారులైన నేవీ సిబ్బందితో , యుద్ధనౌకల వెలుగులతో ధగధగలాడిపోనుంది.
Jagtial: జగిత్యాల పంచాయితీ కొలిక్కి వచ్చినట్టేనా..?
ఈ ఏడాది ఉత్సవాలు కేవలం నౌకాదళ సమీక్షకే పరిమితం కాకుండా, మూడు ప్రధాన కార్యక్రమాల సమాహారంగా సాగనున్నాయి. ఐఎఫ్‌ఆర్‌తో పాటు ప్రతి రెండేళ్లకోసారి జరిగే ‘మిలాన్’ మల్టీ లాటరల్ నేవల్ ఎక్సర్‌సైజెస్ , ‘ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం’ (IONS) కూడా ఇక్కడే నిర్వహిస్తున్నారు. దీనివల్ల హిందూ మహాసముద్ర పరివాహక దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిత్రదేశాలతో సముద్ర భద్రత , పరస్పర సహకారంపై కీలక చర్చలు జరగనున్నాయి. ఆదివారం సాయంత్రం ‘మిలాన్’ పేరుతో ఒక ప్రత్యేక గ్రామాన్ని ప్రారంభించడంతో ఈ ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఈ గ్రామంలో భారతదేశంలోని అన్ని రాష్ట్రాల సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు, ఇది విదేశీ అతిథులకు మన సంస్కృతిని పరిచయం చేసే ‘మినీ ఇండియా’లా కనిపిస్తోంది.
ఈ పది రోజుల షెడ్యూల్‌లో కొన్ని ఘట్టాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఫిబ్రవరి 18న భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము యుద్ధనౌకలను సమీక్షించనుండగా, ఫిబ్రవరి 19న ఆర్‌కే బీచ్‌లో నిర్వహించే ‘ఇంటర్నేషనల్ సిటీ పరేడ్’ అత్యంత వైభవంగా జరగనుంది. ఈ పరేడ్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. 21వ తేదీ నుండి 25వ తేదీ వరకు సముద్ర గర్భంలో జరగబోయే యుద్ధ విన్యాసాలు సందర్శకులను మంత్రముగ్ధులను చేయనున్నాయి. గతంలో అండమాన్‌కే పరిమితమైన ‘మిలాన్’ విన్యాసాలను, మెరుగైన మౌలిక వసతుల దృష్ట్యా ఇప్పుడు విశాఖకు మార్చడం ఇక్కడి పర్యాటక రంగానికి కూడా ఊతాన్నిస్తోంది. మన నౌకాదళ శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి చాటిచెప్పడమే కాకుండా, వివిధ దేశాల యుద్ధనౌకలు , జలాంతర్గాములను అతి సమీపంగా చూసే అరుదైన అవకాశం ఈ ఉత్సవాల ద్వారా ప్రజలకు దక్కుతోంది.
Maha Shivaratri 2026: ఈ 4 రాశుల వారికి శివయ్య ఆశీస్సులు.. మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి!
