Bjp Leader Vishnu Vardhan Reddy Comments On AP Government: ఏపీ ప్రభుత్వ విధానాలపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు విద్యార్థులకు శాపంగా మారాయని దుయ్యబట్టారు. ప్రణాళిక లేకుండా స్కూళ్లు మూసివేయడం సరికాదన్నారు. మూడు కిలో మీటర్లు వెళ్లి పిల్లలు చదువుకుంటారా అని ప్రశ్నించారు. ఒకే గదిలో మూడు తరగతుల పిల్లలకు పాఠాలు చెప్పడమేంటని నిలదీశారు. ఈ విషయాలను వెలుగులోకి తెస్తే అన్యాయంగా జర్నలిస్టులపై కేసులు పెట్టడం దిక్కుమాలిన చర్యగా అభివర్ణించారు. ఈ కేసులను వెంటనే ఉప సంహరించుకోవాలని విష్ణువర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. దేశం మొత్తం జాతీయ విద్యా విధానం(NEP) అమలు అవుతుందని.. జగన్ ఎడ్యుకేషన్ పాలసీని(JEP) మాత్రమే ఏపీలో అమలు చేస్తున్నారని చురకలు అంటించారు. జగన్ రివర్స్ పాలనకు ఇదే పెద్ద ఉదాహరణ అని అభివర్ణించారు.
జగన్ మాత్రమే జాతీయ విద్యా విధానం ముసుగులో విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారని విష్ణువర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. విదేశాల్లో కోట్లు పెట్టి జగన్ ఆయన పిల్లలను చదివిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో యువ సంఘర్షణ యాత్ర చేపడుతున్నట్లు వెల్లడించారు. ఆగస్టు 2నుండి ఈ యాత్ర ద్వారా జగన్ మోసాలను ప్రజలకు వివరిస్తామన్నారు. జాతీయ విద్యా విధాన వ్యతిరేక చర్యలపై బీజేపీ పోరాటం చేస్తుందని వివరించారు. ఈ ఏడాది పాఠశాలల విలీన ప్రక్రియను ఆపాలన్నారు. పేదలకు బియ్యం ఇప్పించిన విధంగా విద్యా విధానంలో కూడా మార్పు తెప్పిస్తామన్నారు. వైసీపీ వైఫల్యాలపై బీజేపీ ఉద్యమ కార్యాచరణను ముందుకు తీసుకువెళ్తామన్నారు.
Read Also: Draupadi Murmu : దేశ ప్రజల విశ్వాసం నిలబెట్టుకునేందుకు కృషి చేస్తా
నూతన రాష్ట్రపతిగా చిన్న వయసులో ఎంపికైన ద్రౌపది ముర్ముకు ఏపీ బీజేపీ తరఫున శుభాభినందనలు తెలుపుతున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి వెల్లడించారు. మహిళలకు తమ పార్టీ ఇచ్చే అరుదైన గౌరవానికి ఇదే నిదర్శనమన్నారు. వరద ప్రాంతాలలో బీజేపీ నేతలు, కార్యకర్తలు పర్యటించారని.. అక్కడి ప్రజలకు 11రోజులుగా తిండి లేదు, గూడు లేదని ఆవేదన చెందుతున్నారన్నారు. ఇంత నిర్లక్ష్యంతో ఉన్న ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదన్నారు. ప్రజల సొమ్ముతో, పన్నుతో బతుకుతూ… వారి బతుకులను బజారు పాలు చేస్తారా అంటూ విష్ణువర్ధన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 215 గ్రామాలు వరదలో చిక్కుకోగా 70వేల మంది కట్టు బట్టలతో బయటకు వచ్చారని.. ముంపు ప్రాంతాల బాధితులను జగన్ గాలికొదిలేశారని.. ఆయన మాత్రం గాలిలోనే తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలిపారని.. వారు తెలంగాణకు వెళ్లిపోతామని చెప్తున్నామంటే జగన్ సిగ్గుపడాలన్నారు.
జగన్ విలాస వంతమైన భవనంలో ఉంటారని.. అందరూ అలాగే ఉంటారనుకోవడం జగన్ భ్రమ అని విష్ణువర్ధన్‌రెడ్డి చురకలు అంటించారు.సమయం వచ్చినప్పుడు జగన్ కు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ఇటీవల నెల్లూరులో మురుగునీటిలో వైసీపీ ఎమ్మెల్యే ముక్కు మూసుకుని దిగి పది నిమిషాలు ఉండలేకపోయారని.. అక్కడ ప్రజలు ఎలా ఉంటున్నారో ఆలోచన చేయాలన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అయితే బటన్ నొక్కుతున్నారని.. లక్షల మందికి డబ్బులు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారని.. 75వేల మంది వరద బాధితులకు డబ్బులు ఇవ్వలేరా అని ప్రశ్నించారు. రూ.2వేలు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంటుందన్నారు. పది రోజుల తరువాత జగన్ తన పర్యటనతో ప్రజలకు ఏం సమాధానం చెప్తారని విష్ణువర్ధన్‌రెడ్డి నిలదీశారు.
