Site icon NTV Telugu

Vizag Honey Trap Case: హనీట్రాప్ కేసు.. కీలక ఆధారాలు స్వాధీనం

Vizag Honey Trap Case

Vizag Honey Trap Case

విశాఖ హనీట్రాప్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కస్టడీలోకి తీసుకున్న కిలాడీ జెమిమా నుండి కీలక ఆధారాలు స్వాధీనం పరుచుకున్నారు పోలీసులు. జెమిమాకు చెందిన మిగతా మొబైల్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అందులో కీలక వ్యక్తుల డేటా లభ్యం అయినట్లు సమాచారం.. అయితే పోలీసులు మాత్రం వివరాలు గోప్యంగా ఉంచుతున్నారు. హనీ ట్రాప్ కేసులో కీలక వ్యక్తులు సమాచారం బయట పడకుండా జాగ్రత్త పడుతున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు.. జెమీమాను 3 రోజులు కస్టడీ కోరి రెండు రోజులకే ముగించారు పోలీసులు. అంతేకాకుండా.. మీడియా వద్ద నోరు తెరవనీయకుండా పోలీసులు జాగ్రత్తలు పడ్డారు. కస్టడీ ముగిశాక వైద్య పరీక్షలు నిర్వహించకుండా పోలీస్ వెహికల్‌లో తిప్పిన వైనం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. మీడియాను చూసి కేజీహెచ్ వద్ద నుండి జెమిమాను వెనక్కి తీసుకెళ్లిపోయారు కంచరపాలెం పోలీసులు. హనీ ట్రాప్ ముఠా సభ్యుల్లో డిపార్ట్మెంట్ అధికారులు ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

Read Also: Attack on Arvind Kejriwal: పాదయాత్రలో కేజ్రీవాల్‌పై దాడి.. బీజేపీ పనే?

కాగా.. ఉదయం కస్టడీలోకి తీసుకున్న పోలీసులు జెమీమాను విచారించారు. జెమీమా పరిచయాలపై ఆరా తీశారు. ఫారెస్ట్ అధికారితో కిలాడీ లేడీకి ఉన్న సంబంధాలపై విచారించారు. ఇక, హనీట్రాప్ ముఠా సభ్యుల కోసం ప్రత్యేక బృందాల గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఠా కీలక సభ్యుడు వేముల కిషోర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హనీ ట్రాప్ కేసులో ఇప్పటికే విస్తుపోయే విషయాలు వెలుగు చూసిన విషయం విదితమే.. తనపై మత్తుమందు చల్లి.. ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను తీసిందని పోలీసులకు వరుసగా బాధితులు కంప్లైంట్ చేయడంతో.. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు.. అందులో భాగంగా కిలాడీ లేడీని పోలీసులు కస్టడీలోకి తీసుకున్న విషయం విదితమే.

Read Also: Vijayawada: ఐసీఐసీఐ బ్యాంక్ స్కాంలో కొత్త ట్విస్ట్..

Exit mobile version