Vizag Central Jail: అవాంచనీయ ఘటనలకు కేంద్రంగా మారిందంటూ విశాఖ సెంట్రల్ జైల్‌పై ఆరోపణలు వచ్చితన తరుణంలో ప్రక్షాళన ప్రారంభించింది ప్రభుత్వం.. గంజాయి ఖైదీలతో మిలాఖత్ ఆరోపణలు రుజువవ్వడంతో ఇద్దరు సీనియర్ అధికారులపై వేటు పడింది. పర్యవేక్షణ లోపం కారణంగా పరిస్థితులు అదుపుతప్పడానికి బాధ్యులైన సూపరింటెండెంట్ ఎస్.కిషోర్‌కుమార్, అదనపు కార్యనిర్వహణాధికారి ఎం.వెంకటేశ్వర్లును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కిషోర్ కుమార్, వెంకటేశ్వర్లు ఇటీవల జరిగిన బదిలీల్లో ఒకరు అనంతపురం, మరొకరు నెల్లూరు సెంట్రల్ జైలుకు వెళ్ళారు. తదుపరి ఉత్తర్వులు తదుపరి వచ్చే వరకు సస్పెన్షన్ కొనసాగనుంది. అప్పటి వరకు సీనియర్ అధికారులు హెడ్‌క్వార్టర్స్‌ను వదిలి వెళ్లకూడదని ఆదేశాలు జారీ అయ్యాయి.
Read Also: Pushpa 2 : జాతర ఎపిసోడ్ కు జాతీయ అవార్డు గ్యారెంటీ
విశాఖ కేంద్ర కారాగారంలోవరుస అవాంఛనీయ ఘటనలను రాష్ట్ర హోంశాఖ సీరియస్‌గా తీసుకుంది. ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపి నిజమని తేలడంతో ఇద్దరు అధికారులపై వేటు వేసింది. వీరిద్దరి సీడీఆర్(కాల్ డేటా రికార్డు) ఆధారంగా మొబైల్ ఫోన్‌లను చాలా సార్లు ఉపయోగించినట్లు తేలింది. జైలు నుంచి రాత్రి వేళల్లో ఫోన్ కాల్స్ బయటకు వెళ్లినట్టు నిర్ధారణ అయ్యింది. ఖైదీ ఉప్పాడ గౌరీశంకర్ వాష్ రూమ్‌లో ఉరివేసుకుని ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల ఓ రౌడీషీటర్ కోసం లంచ్ బాక్స్ లో గంజాయి తరలిస్తూ ఫార్మాసిస్టు పట్టుబడ్డాడు. ఇవి కాకుండా భద్రతలో కీలకమైన సెక్యూరిటీగార్డుల షిఫ్ట్ విధానాన్ని అమలు చేయడంలో ఇద్దరూ విఫలమైనట్లు శాఖ పరమైన విచారణలో తేలింది.. దీంతో చర్యలకు దిగింది ప్రభుత్వం..