NTV Telugu Site icon

Vizag Steel Plant: విశాఖ పర్యటనకు మోడీ.. స్టీల్‌ప్లాంట్‌పై కీలక ప్రకటన..!

Vizag Steel Plant

Vizag Steel Plant

Vizag Steel Plant: ప్రధాని నరేంద్రమోడీ పర్యటనలో పలు కీలక ప్రాజెక్టులు పట్టాలెక్కబోతున్నాయి. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఉత్తరాంధ్ర వాసులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న రైల్వేజోన్ ప్రధాన కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు ప్రధాని. అనకాపల్లి జిల్లా పూడిమడక దగ్గర NTPC గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ పనులను ప్రారంభిస్తారు. రెండు దశల్లో లక్షా 85వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. రోజుకు 15 వందల టన్నుల గ్రీన్‌ హైడ్రోజన్‌తో పాటు అమ్మోనియా, మిథనాలను, సస్టెయినబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ ఉత్పత్తి జరగనుంది. దీనివల్ల 25 వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. రోజుకు 80 మిలియన్ లీటర్ల సముద్రపునీటిని డీసాలినేషన్ చేసి హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 2వేల ఎకరాలతో నిర్మించే బల్క్‌డ్రగ్‌ పార్కుకు కూడా శంకుస్థాపన చేయబోతున్నారు ప్రధాని.. దీనికి సుమారు 19వందల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. 10 నుంచి 14వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. 28 వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు.

Read Also: Justin Trudeau: ట్రంప్ ప్రకటనపై కెనడా నేతలు ఆగ్రహం..

కొత్త రైల్వేలైన్లు, డబ్లింగ్‌, విద్యుదీకరణ, హైవే ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర శ్రీకారం చుడతారు, చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా తిరుపతి జిల్లాలో క్రిస్‌సిటీకి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. ఇక్కడ ఫుడ్‌ ప్రాసెసింగ్, టెక్స్‌టైల్స్‌, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్స్, ఆటో, ఫార్మా సంస్థలు రాబోతున్నాయి. తొలిదశలోనే 37వేల కోట్లకు పైగా పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా నాలుగున్నర లక్షల మందికి ఉపాధి దక్కుతుందని అంచనా వేస్తున్నారు. ఆదోని-బైపాస్‌ 2వరుసలు, దోర్నాల-కుంట జంక్షన్, సంగమేశ్వరం-నల్లకాలువ రోడ్ల విస్తరణ పనులను వర్చువల్‌గా ప్రారంభిస్తారు మోడీ. చిలకలూరిపేట ఆరువరసల బైపాస్‌, నాగార్జునసాగర్‌-దావులపల్లి 2వరుసల రోడ్డు, గుడివాడ-మచిలీపట్నం, భీమవరం-నిడదవోలు డబ్లింగ్‌, గుత్తి-ధర్మవరం రైల్వేలైన్‌ డబ్లింగ్‌ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు మోడీ. ఇక, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ వ్యవహారంలో ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదనే విమర్శలు ఉన్న నేపథ్యంలో.. విశాఖ వేదికగా స్టీల్‌ ప్లాంట్‌పై కూడా ప్రధాని మోడీ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు..