Site icon NTV Telugu

Deputy CM Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు.. చప్పట్లు, పొగడ్తలు అవసరం లేదు.. పని మాత్రమే కావాలి..

Deputy Cm Pawan Kalyan

Deputy Cm Pawan Kalyan

Deputy CM Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.. ఉత్తరాంధ్ర పంచాయతీరాజ్ అధికారుల సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారులకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. తనకు చప్పట్లు, పొగడ్తలు అవసరం లేదని, క్షేత్రస్థాయిలో నిజమైన పని మాత్రమే కావాలని తేల్చి చెప్పారు. ఉన్నత స్థాయి అధికారుల నుంచి ఫీల్డ్ అసిస్టెంట్ వరకు ప్రతి ఒక్కరు పూర్తి నిబద్ధతతో పని చేయాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఉపాధి హామీ పథకం, జల్ జీవన్ మిషన్ వంటి కీలక పథకాల అమలులో నిర్లక్ష్యం, నిధుల దుర్వినియోగం జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిర్దేశిత లక్ష్యాలను చేరుకోలేకపోయినా, పనిలో అలసత్వం చూపించినా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

Read Also: Raipur Central Jail: ఆ కేసులో అరెస్టైన ప్రియుడు.. జైలుకెళ్లి సర్ ప్రైజ్ చేసిన ప్రియురాలు..

సోషల్ ఆడిట్ ప్రక్రియను కూడా మొక్కుబడిగా కాకుండా పక్కాగా నిర్వహించాలని సూచించారు. అభివృద్ధి ఫలాలు క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరికీ చేరాల్సిందేనని, అలా జరగకపోతే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు.. ఇక, తన వైపు నుంచి ఎలాంటి రాజకీయ ఒత్తిడులు, సిఫార్సులు ఉండవని పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పారు. ప్రతి అధికారి నిబంధనల ప్రకారమే పని చేయాలన్నారు. గత ప్రభుత్వంలో పని చేసిన కొంతమంది అధికారులు ఇప్పటికీ పాత నాయకులతో సంబంధాలు కొనసాగిస్తూ ప్రభుత్వ విధానాల అమలులో నిర్లక్ష్యం వహిస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి వ్యవహారాలను ఇకపై సహించబోమని హెచ్చరించారు. ఎలాంటి రాజకీయ ప్రలోభాలకు తావులేకుండా నిబంధనల మేరకు మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పనిలో అలసత్వాన్ని అస్సలు సహించబోమని మరోసారి స్పష్టం చేశారు.

ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న పదోన్నతులను ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా పూర్తి చేశామని పవన్ కల్యాణ్ తెలిపారు. ఒకేసారి దాదాపు 10 వేల మందికి ప్రమోషన్లు కల్పించడం ద్వారా ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటుకున్నామన్నారు. అధికారులు పొందిన ఈ సంతోషం ప్రజల్లోనూ కనిపించాలన్నారు. ఉమ్మడి కడప జిల్లాలో ఎంపీడీవోపై దాడి ఘటన చోటుచేసుకున్నప్పుడు స్వయంగా అక్కడికి వెళ్లి భరోసా ఇచ్చామని గుర్తు చేశారు. అధికారులు కష్టాల్లో ఉంటే ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కష్టపడుతోందని పవన్ కల్యాణ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పెద్దల మద్దతు కూడగట్టి నిధులు సాధిస్తున్నామని చెప్పారు. ఆ కష్టానికి సార్ధకత చేకూరేలా అధికారులు సమర్థంగా పని చేయాలని కోరారు. ప్రజల సంక్షేమం, సంతోషమే లక్ష్యంగా పని చేయాలని, కూటమి ప్రభుత్వ సంకల్పానికి అధికారులు పూర్తి స్థాయిలో తోడుగా నిలవాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.

Exit mobile version