CII Partnership Summit: 141 ఒప్పందాలు.. 2.46 లక్షల ఉద్యోగాలు.. విశాఖలో పెట్టుబడుల పండుగ!

Cii Partnership Summit

Cii Partnership Summit

CII Partnership Summit: ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు, ఉపాధి అవకాశాలే లక్ష్యంగా విశాఖపట్నం వేదికగా నేటి నుంచి CII పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ అంతర్జాతీయ సదస్సు ద్వారా రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. ఈ రెండు రోజుల సదస్సులో భాగంగా మొత్తం 141 అవగాహన ఒప్పందాలు (MoUs) కుదుర్చుకోవాలని లక్ష్యంగా నిర్ణయించారు. వీటి ద్వారా సుమారు రూ.12.14 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ పెట్టుబడుల ద్వారా దాదాపు 2.46 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.

ఇక, సదస్సులో ఐదు కీలక రంగాలపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. ఆయా రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, పారిశ్రామిక అభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికలపై చర్చలు జరగనున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని వివరించడంతో పాటు అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ఈ సదస్సును వేదికగా ఉపయోగించుకోనున్నారు. ఈ అంతర్జాతీయ సదస్సుకు 18 మంది విదేశీ మంత్రులు హాజరుకానున్నారు. అలాగే 58 దేశాల నుంచి సుమారు 3,500 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. అంతర్జాతీయ స్థాయిలో విశాఖపట్నానికి గుర్తింపు తీసుకురావడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడుల గమ్యస్థానంగా నిలబెట్టేందుకు ఈ సదస్సు కీలకంగా మారనుంది… ఓ వైపు సంక్షేమ అందిస్తూనే.. మరోవైపు అభివృద్ధిపై ఫోకస్‌ పెట్టిన కూటమి ప్రభుత్వం.. పెట్టుబడులే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది..