Ashwini Vaishnaw: అభివృద్ధి, సంక్షేమం విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి న్యాయం చేస్తోందని కేంద్ర ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. విశాఖలో గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు కీలక ప్రకటనలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో కీలకమైన సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌ను 2026 జూన్ 1న అధికారికంగా నోటిఫై చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా ఈ జోన్ ఏర్పాటుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు.
విశాఖ ఇక ఏఐ పట్నం
గూగుల్ ఏఐ డేటా సెంటర్‌తో విశాఖపట్నం ఇకపై ఏఐ పట్నంగా మారుతుందని అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ విజన్‌కు సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. గూగుల్‌తో ఎంఓయూ కుదుర్చుకున్న తక్కువ సమయంలోనే శంకుస్థాపన జరగడం విశేషమన్నారు. త్వరలోనే ఈ ఏఐ డేటా సెంటర్‌ను ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభించే రోజు దగ్గరలోనే ఉందని చెప్పారు. విద్య, వైద్యం, ఏరోస్పేస్, లాజిస్టిక్స్, వ్యవసాయం వంటి రంగాల్లో ఏఐ విప్లవం రానుందని తెలిపారు.
భారత్ టెక్నాలజీ రంగంలో ముందంజ
భారత్ ఐటీ సేవల రంగంలో ప్రపంచ నాయకత్వం వహిస్తోందని అన్నారు వైష్ణవ్.. మొబైల్ తయారీ రంగంలో భారత్ భారీ ముందడుగు వేసిందని, దేశం నుంచి అత్యధికంగా ఎగుమతి అవుతున్న ఉత్పత్తిగా మొబైల్ ఫోన్లు మారాయని చెప్పారు. ప్రస్తుతం దేశీయ అవసరాల్లో 50 శాతం ఎలక్ట్రానిక్ పరికరాలు భారత్‌లోనే తయారవుతున్నాయని వెల్లడించారు. సెమీ కండక్టర్ మిషన్‌లో భాగంగా వాణిజ్య ఉత్పత్తి కూడా ప్రారంభించామని, భారత్ ఇప్పుడు సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ తయారీలో విశ్వసనీయ భాగస్వామిగా ఎదిగిందన్నారు.
గూగుల్‌కు ప్రత్యేక పిలుపు
డేటా సెంటర్లకు అవసరమైన సర్వర్లు, జీపీయూలు, చిప్‌లను కూడా భారత్‌లోనే తయారు చేయాలని గూగుల్‌ను కోరారు. ఈ సందేశాన్ని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కు కూడా తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక, విశాఖ నుంచి మూడు సబ్‌సీ కేబుల్స్ వేస్తున్నందుకు గూగుల్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఆస్ట్రేలియా, మిడిల్ ఈస్ట్ మీదుగా యూరప్‌కు, ఆఫ్రికా మీదుగా అమెరికాకు కనెక్టివిటీ కల్పించేలా ఈ కేబుల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
ఏపీకి భారీ రైల్వే బడ్జెట్
ఏపీకి రూ.10,134 కోట్ల రైల్వే బడ్జెట్ కేటాయించామని మంత్రి వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు గతంలో కేవలం రూ.886 కోట్లు మాత్రమే ఉండేదని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.1.06 లక్షల కోట్ల రైల్వే ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. 74 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని, 832 ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించామని, 1039 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్లు వేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 100 శాతం రైల్వే ఎలక్ట్రిఫికేషన్ పూర్తి అయిందన్నారు.
వందే భారత్, అమృత్ భారత్ సేవలు
ప్రస్తుతం ఏపీలో 16 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని, 22 అమృత్ భారత్ సేవలు కూడా రాష్ట్రం నుంచి అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఇక అమరావతి నుంచి హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు త్వరలోనే సాకారం కానుందని అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ద్వారా కేవలం 70 నిమిషాల్లో హైదరాబాద్ చేరుకోవచ్చన్నారు. అలాగే అమరావతి నుంచి చెన్నైకు 112 నిమిషాల్లో చేరుకునేలా మరో బుల్లెట్ ట్రైన్ ప్రణాళిక కూడా ఉందన్నారు. ప్రతిపక్ష పార్టీలు ప్రతి అంశాన్నీ రాజకీయంగా చూస్తున్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం అభివృద్ధి, సంక్షేమంలో సమాన న్యాయం చేస్తోందని స్పష్టం చేశారు.
