Site icon NTV Telugu

Ashok Gajapathi Raju: గూగుల్ డేటా సెంటర్‌కు సింహాచలం భూముల కేటాయింపు.. అశోక్‌ గజపతిరాజు సంచలన వ్యాఖ్యలు..

Ashok Gajapathi Raju

Ashok Gajapathi Raju

Ashok Gajapathi Raju: సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చెందిన భూములను గూగుల్ డేటా సెంటర్‌కు కేటాయించడంపై గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు స్పందించారు. విశాఖలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, అభివృద్ధి మరియు ఆధ్యాత్మికత మధ్య సమతుల్యత ఉండాలని అభిప్రాయపడ్డారు. అయితే, సింహాచలం భూముల కేటాయింపుపై కీలక వ్యాఖ్యలు చేశారు.. “పెట్టుబడుల వల్ల ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అది మంచి పరిణామమే. కానీ, అదే సమయంలో భక్తుల మనోభావాలను గౌరవించడం చాలా ముఖ్యం” అని ఆయన పేర్కొన్నారు. దేవుడికి భక్తులు సమర్పించిన భూములు కాబట్టి, వాటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు భక్తుల నమ్మకాలకు లోబడి ఉండాలని హితవు పలికారు. గతంలో ప్రభుత్వ సంస్థలు తీసుకున్న భూములకు సంబంధించిన రికార్డులను కూడా నేటికీ అప్‌డేట్ చేయలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

Read Also: Vishwak Sen’s CULT Teaser: ‘కల్ట్’ టీజర్‌తో విశ్వక్ సేన్ ఊచకోత!

మరోవైపు, ఇటీవల తిరుమల వేంకటేశ్వరస్వామి ఫోటోలతో ఎమ్మెల్సీలు చేసిన ప్రదర్శనపై అశోక్ గజపతిరాజు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. “దైవం పట్ల ఎవరు అనుచితంగా ప్రవర్తించినా తప్పే. దేవుడిని రాజకీయాల్లోకి లాగడం బాధాకరం” అని అన్నారు. ప్రసాదాల నాణ్యత విషయంలో పూర్తి బాధ్యత పాలకమండలిదేనని, పారదర్శకత కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక, గత ఏడాది చందనోత్సవం సమయంలో జరిగిన అపశ్రుతులను దృష్టిలో ఉంచుకుని, ఈసారి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్లు ఆయన తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శన ఏర్పాట్లు ఉండాలని అధికారులను కోరారు గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు.

Exit mobile version