Araku Valley Weather: పడిపోయిన ఉష్ణోగ్రతలు!.. అరకు లోయలో మంచు అందాలు..

Araku Valley

Araku Valley

Araku Valley Weather: ఆంధ్రా ఊటీగా, భూతల స్వర్గంగా పేరుగాంచిన అరకు లోయలో మంచు అందాలు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. చలి తీవ్రత ఒక్కసారిగా పెరగడంతో అరకు ప్రాంతం మంచు దుప్పటి కప్పుకుంది. ఓవైపు భారీగా కురుస్తున్న మంచు, మరోవైపు గజగజలాడిస్తున్న చలితో పర్యాటకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలు అరకులో రికార్డవడంతో పర్యాటక ప్రాంతాల్లో సందడి నెలకొంది. అరకు లోయలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా 11 డిగ్రీలకు పడిపోయాయి. రానున్న రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో చలిని, మంచు అందాలను ఆస్వాదించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు.

ముఖ్యంగా తెల్లవారుజామునే మాడగడ సన్‌రైజ్ వ్యూ పాయింట్‌కు పర్యాటకులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. అక్కడ కనిపిస్తున్న పాలకడలిని తలపించే మేఘాల అందాలను చూసి మంత్రముగ్ధులవుతున్నారు. కొండల మధ్య నుంచి విస్తరించిన తెల్లటి మంచు మేఘాలు ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తున్నాయి. మంచు దుప్పటి కప్పేసిన అరకు లోయలో ఉదయం 11 గంటల వరకు సూర్యుడి జాడ కనిపించడం లేదు. చల్లని వాతావరణం, మంచు అందాలతో పర్యాటకులు తమ పర్యటనను ఆస్వాదిస్తున్నారు. మొత్తంగా చలి తీవ్రత పెరగడంతో అరకు లోయ పర్యాటకులతో కళకళలాడుతోంది.