CII Partnership Summit 2026: ఏపీకి భారీ పెట్టుబడుల వెల్లువ.. రెండో రోజు రూ.1.41 లక్షల కోట్ల ఒప్పందాలు..

Cii Partnership Summit 2026

Cii Partnership Summit 2026

CII Partnership Summit 2026: ఆంధ్రప్రదేశ్‌కు భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయి.. విశాఖపట్నం వేదికగా జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. సదస్సు రెండో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో వివిధ ప్రముఖ కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఏపీసీఆర్డీఏ, ఏపీ మారిటైమ్ బోర్డు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ విభాగాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీ4 కార్యక్రమానికి సంబంధించి కంపెనీల ప్రతినిధులు ఒప్పందాలు చేసుకున్నారు. మొత్తం 11 ఎంఓయూలు, ఒక జీఓ జారీ ద్వారా రూ.1,41,585 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. వీటి ద్వారా 10,919 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

హిందాల్కో నుంచి రూ.15 వేల కోట్ల పెట్టుబడులు
ప్రకాశం జిల్లా కందుకూరులో మైనింగ్ కార్యకలాపాలు చేపట్టేందుకు హిందాల్కో గ్రూప్ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు కోసం సంస్థ రూ.15 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీని ద్వారా సుమారు 2,500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. రాష్ట్రంలో పారిశ్రామిక, మైనింగ్ రంగాల అభివృద్ధికి ఈ ఒప్పందం దోహదపడనుంది.

తిరుపతిలో డేటా సెంటర్, రాకెట్ ఫ్యాక్టరీ
అంతరిక్ష, సాంకేతిక రంగాల్లోనూ ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయి. తిరుపతి జిల్లాలో ఆర్బిటల్ డేటా సెంటర్, రాకెట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు అగ్నికుల్ కాస్మోస్ లిమిటెడ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ ప్రాజెక్టు కోసం రూ.510 కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా.. 350 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. మరోవైపు ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో హాథోర్ రాకెట్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.250 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ సంస్థ ద్వారా 200 మందికి ఉపాధి లభించనుంది.

గ్రీన్ ఎనర్జీ రంగంలో భారీ పెట్టుబడులు
పునరుత్పాదక ఇంధన రంగంలోనూ ప్రముఖ సంస్థలు ఏపీలో పెట్టుబడులకు ఆసక్తి చూపించాయి. గ్రీన్ జెన్ రెన్యూవబుల్ ఎనర్జీ సంస్థ రూ.8 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 200 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. అలాగే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పునరుత్పాదక విద్యుత్ రంగంలో రూ.6,600 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 800 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

డేటా సెంటర్ల ఏర్పాటుకు రూ.1.03 లక్షల కోట్ల పెట్టుబడులు
సీఐఐ భాగస్వామ్య సదస్సులో అత్యంత భారీ పెట్టుబడుల ఒప్పందాల్లో ఎయిర్ ట్రంక్ ఇండియా-జేసీకే ఇన్‌ఫ్రా ఒప్పందం ప్రత్యేకంగా నిలిచింది. ఐటీ విభాగంతో ఈ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. 1,400 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ క్యాంపస్, టెలికాం సెంటర్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశాయి. ఈ ప్రాజెక్టు కోసం ఏకంగా రూ.1,03,018 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. దీని ద్వారా 3,120 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు.

ఎలక్ట్రానిక్స్ రంగంలో డిక్సన్ టెక్నాలజీస్ పెట్టుబడులు
ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలోనూ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా ఐటీ, ఎలక్ట్రానిక్స్ విభాగంతో ఒప్పందం చేసుకుంది. ఈ సంస్థ రూ.700 కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా.. 2,300 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో ఏపీని మరింత బలోపేతం చేసేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడనుంది.

కాకినాడ పోర్టు అభివృద్ధికి రూ.6,452 కోట్లు
సముద్ర రవాణా, నౌకాయాన రంగాల అభివృద్ధికి సంబంధించి కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ ఏపీ మారిటైమ్ బోర్డుతో ఒప్పందం కుదుర్చుకుంది. మెకనైజ్డ్ బెర్త్, రీగ్యాసిఫికేషన్ యూనిట్, షిప్ బిల్డింగ్ అండ్ రిపేర్ కాంప్లెక్స్ ఏర్పాటుకు ఈ ఒప్పందం జరిగింది. ఇందుకోసం రూ.6,452 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 852 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

పర్యాటక రంగంలో ఒబెరాయ్ హోటల్స్ పెట్టుబడులు
రాష్ట్ర పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా ఒబెరాయ్ హోటల్స్ గ్రూప్‌కు చెందిన ఈఐహెచ్ లిమిటెడ్ ఏపీసీఆర్డీఏతో ఒప్పందం చేసుకుంది. ఈ సంస్థ రూ.175 కోట్ల పెట్టుబడితో హోటల్ ప్రాజెక్టును చేపట్టనుంది. దీని ద్వారా 150 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. పర్యాటక రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ పెట్టుబడి దోహదపడనుంది.

పీ4 కార్యక్రమానికి హీరో మోటార్స్, ఐటీసీ సహకారం
పెట్టుబడులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీ4 (పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టనర్‌షిప్) కార్యక్రమానికి సంబంధించి కూడా సీఐఐ సదస్సులో రెండు కీలక ఒప్పందాలు కుదిరాయి. రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల్లోని 1,120 మంది ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఆర్థిక సహకారం అందించేందుకు స్వర్ణాంధ్ర ఫౌండేషన్, హీరో మోటార్ కార్పొరేషన్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం రూ.32.48 కోట్ల మేర ఆర్థిక సాయం అందించనున్నారు. విద్యార్థుల విద్యాభ్యాసానికి అవసరమైన సహకారం అందించడం ఈ కార్యక్రమం లక్ష్యం. మరోవైపు రాష్ట్రంలోని 100 గ్రామాల్లో 25 వేల బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేందుకు స్వర్ణాంధ్ర ఫౌండేషన్, ఐటీసీ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కుటుంబాలకు జీవనోపాధి అవకాశాలు పెంపొందించడంతో పాటు వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అవసరమైన సహకారం అందించనున్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాల అభ్యున్నతికి పీ4 కార్యక్రమం ద్వారా ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యాన్ని పెంచడమే ఈ ఒప్పందాల ఉద్దేశం.

11 ఎంఓయూలు.. ఒక జీఓ.. రూ.1,41,585 కోట్ల పెట్టుబడులు
మొత్తంగా సీఐఐ భాగస్వామ్య సదస్సు రెండో రోజు ఏపీకి భారీ పెట్టుబడులు ఖరారయ్యాయి. వివిధ రంగాలకు చెందిన కంపెనీలతో 11 అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు), ఒక ప్రభుత్వ ఉత్తర్వు (జీఓ) జారీ ద్వారా రూ.1,41,585 కోట్ల పెట్టుబడులకు మార్గం సుగమమైంది. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 10,919 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. మైనింగ్, డేటా సెంటర్లు, అంతరిక్ష పరిశోధన, రక్షణ, పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రానిక్స్, పోర్టులు, పర్యాటక రంగాల్లో వచ్చిన ఈ పెట్టుబడులు ఏపీ పారిశ్రామిక అభివృద్ధికి ఊతమివ్వనున్నాయి.