NTV Telugu Site icon

విశాఖలో సైన్స్‌కు అందని అద్భుతం

పునర్జన్మల మీద ఎవరి నమ్మకం వారిది. సైన్స్ కు అందని రహస్యాలు అప్పుడప్పుడు సాక్షాత్కారం అవుతాయి. విశాఖలో అమ్మకు దూరమైన ఇద్దరు చిన్నారులు….సరిగ్గా వాళ్ళు చనిపోయిన రోజే…అదే సమయంలోనే జన్మించారు. మళ్ళీ తమ పిల్లలే తిరిగి పుట్టారని తల్లిదండ్రులు సంతో షంలో వుంటే.. వైద్యులకు మాత్రం ఇది మిరాకిల్ గానే కనిపిస్తోంది. సెప్టెంబరు 15, 2019.. గోదావరి నదీ ప్రమాదాల్లో అతిపెద్ద విషాదం. రాజమండ్రి నుంచి భద్రాచలం బయలుదేరిన వశిష్ఠ బోటు గోదావరి నదిలో మునిగిపోయింది. దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన ఈ ప్రమాదంలో 50 మందికి పైగా జలసమాధి అయ్యారు.

ఈ ప్రమాదంలో విశాఖకు చెందిన 3 ఏళ్ల గీతావైష్ణవి, 18 నెలల ధాత్రి అనన్య మృతిచెందారు. బంగారు బొమ్మల్లాంటి పిల్లలను పోగొట్టుకున్న భాగ్యలక్ష్మి, అప్పలరాజు దంపతులకు భవిష్యత్తు అంధకారంగా కనిపించింది. అప్పటికే భాగ్యలక్ష్మి ట్యూబెక్టమీ ఆపరేషన్‌ చేయించుకుంది. దీంతో ఇక పిల్లలు పుట్టరని కుంగిపోయారు. మళ్లీ పిల్లలు కావాలనే కోరికతో విశాఖలో ఓ ఐవీఎఫ్ సెంటర్ వైద్యులను సంప్రదించారు. కృత్రిమ గర్భధారణ విధానం ద్వారా భాగ్యలక్ష్మికి మళ్ళీ ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. సాధా రణంగా అయితే ఇది సైన్స్ సాధించిన అద్భుతం. కానీ.. భాగ్యలక్ష్మి, అప్పల రాజులకు మాత్రం ఇది దేవుడిచ్చిన వరం. ఎందుకంటే మరణించింది ఇద్దరు ఆడపిల్లలు కాగా….ట్విన్స్ రూపంలో జన్మించింది కూడా ఆడపిల్లలే.

అదీ ప్రమాదం జరిగిన రోజు…. అదే సమయానికి.ఇది నిజంగా మిరాకిల్ అంటున్నారు డాక్టర్లు. వాస్తవంగా భాగ్యలక్ష్మికి అక్టోబర్‌లో డెలివరీ అవ్వాల్సి వుంది. గత నెలలో ఒకసారి పురిటినొప్పులు వచ్చాయి. అయితే ప్రీమెచ్యూర్ కావడంతో జాగ్రత్తలు తీసుకుని పురుడు వాయిదా వేశారు వైద్యులు. సెప్టెంబర్ 15, సాయంత్రం సమయంలో ఆపరేషన్ చేసి ఇద్దరు ఆడపిల్లలను బయటకు తీశారు. ఏ సమయానికైతే అమ్మకు పిల్లలు దూరమయ్యారో అదే సమయాకి బిడ్డలు ఒడికి చేరడం నమ్మశక్యం కాని నిజం అంటున్నారు డాక్టర్లు. అద్భుతాలు జరిగేప్పుడు ఎవరు ఊహించరు. అదే భాగ్యలక్ష్మి, అప్పలరాజు విషయంలో జరిగింది. మెడికల్ సైన్స్ ఆ తల్లిదండ్రులకు కొత్త జీవితం ప్రసాధించింది.