విజయవాడలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిని పొగాకు నిషేధిత ప్రాంతంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ప్రకటించారు. ఈనెల 26 నుంచి ఆలయ పరిసర ప్రాంతాల్లో పొగాకు ఉత్పత్తుల నిషేధ చట్టం వర్తిస్తుందని ఆయన తెలిపారు. ఆలయ మెట్ల భాగం నుంచి కొండపై వరకు పొగాకు ఉత్పత్తులు నిషేధించినట్లు పేర్కొన్నారు. ఉద్యోగులు, భక్తులు నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.20 నుంచి 200 వరకు ఫైన్ వసూలు చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఆలయ పరిసరాల్లో పొగాకు నిషేధిత సర్క్యులర్‌ను స్వయంగా చదివి ఉద్యోగులకు కలెక్టర్ ఢిల్లీరావు వివరించారు. నేషనల్ టొబాకో కంట్రోల్, కోట్పా 2003 చట్టంలో భాగంగా ఆలయ పరిసరాల్లో పొగాకు ఉత్పత్తులు నిషేధించామన్నారు. ఇప్పటికే ఈ చట్టాన్ని తిరుమలలో అమలు చేస్తున్నారని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు రెండో ఆలయంగా ఇంద్రకీలాద్రిపైనా అమలు చేస్తున్నామని తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులు, ఇక్కడ పనిచేసే ఉద్యోగులు ఆలయ పరిసరాల్లో పొగాకు ఉత్పత్తులు వాడకూడదని స్పష్టం చేశారు. ఈ చట్టం అమలుకు మీడియా సహకారం చాలా అవసరమని కలెక్టర్ ఢిల్లీ రావు అభిప్రాయపడ్డారు.
ఇంద్రకీలాద్రిపై పొగాకు నిషేధించిన విషయాన్ని కేంద్ర ప్రభుత్వం, WHOకు తెలియజేస్తామని కలెక్టర్ ఢిల్లీరావు వెల్లడించారు. భక్తులకు ఆన్ని విధాలుగా ఈ చట్టంపై ఆలయంలో అవగాహన కల్పిస్తామన్నారు. ఆలయ మెట్ల మార్గం, ఘాట్ రోడ్, కౌంటర్స్, క్యూ లైన్స్ లలో పొగాకు ఉత్పత్తులు నిషేధం అన్నారు. భక్తులకు ఈ విషయం తెలియచేయటం కోసం ఎఫ్ఏం రేడియో, డిజిటల్ మీడియా, కరపత్రాల ద్వారా తెలియజేస్తామని పేర్కొన్నారు. అటు భక్తులు, ఆలయ ఉద్యోగులందరికీ ఈ చట్టం వర్తిస్తుందని ఆలయ ఈవో భ్రమరాంబ ప్రకటించారు. ఇప్పటికే ఆలయ ఉద్యోగులకు అవగాహన కల్పించామని.. దీనికి అందరి సహకారం అవసరమన్నారు. కోవిడ్ కేసుల కారణంగా దుర్గా ఘాట్‌లో స్నానాలకు ఇప్పట్లో అనుమతి లేదని స్పష్టం చేశారు.
Andhra Pradesh: ఉద్యోగుల ప్రొబేషన్‌పై ప్రభుత్వం కీలక జీవో జారీ