Site icon NTV Telugu

Kanaka Durga Temple: దుర్గమ్మ భక్తులకు అలర్ట్… ఇంద్రకీలాద్రిపై కీలక మార్పులు..

Kanaka Durga Temple

Kanaka Durga Temple

Kanaka Durga Temple: బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు పలు కీలక సంస్కరణలను అమలు చేశారు. దర్శనం, ప్రసాద పంపిణీ వ్యవస్థలో సమయం ఆదా, పారదర్శకత, దుర్వినియోగ నియంత్రణ లక్ష్యంగా ఈ మార్పులు తీసుకొచ్చారు. ఇకపై రూ.500 అంతరాలయ దర్శన టికెట్‌ తీసుకున్న భక్తులకు ఉచిత లడ్డును.. దర్శనానికి వెళ్లే ముందు, టికెట్ స్కానింగ్ పాయింట్ వద్దే పంపిణీ చేయనున్నారు. అంటే, దర్శనం పూర్తయ్యాక ప్రసాదం కోసం వేరే కౌంటర్ల వద్ద లైన్లలో వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. టికెట్ స్కాన్ అయిన వెంటనే భక్తుడికి లడ్డు చేతికి అందజేసే విధానంను ఆలయ బోర్డు అమల్లోకి తీసుకొచ్చింది.

Read Also: China vs Battle of Galwan: ‘బ్యాటల్ ఆఫ్ గాల్వాన్’ సినిమాపై చైనా మీడియా అక్కసు..

ఈ నిర్ణయం ద్వారా ప్రసాద పంపిణీలో పూర్తి పారదర్శకత ఉంటుందని అధికారులు తెలిపారు. అలాగే, దర్శన టికెట్ల దుర్వినియోగాన్ని అరికట్టడం, ఆలయ ఆదాయ నిర్వహణలో జవాబుదారీతనం పెంచడం కూడా ఈ సంస్కరణ ప్రధాన ఉద్దేశమని వివరించారు. భక్తుల రద్దీ నియంత్రణలో భాగంగా.. ఆలయంలో సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తున్నారు. టికెట్ స్కానింగ్, ప్రసాదం తక్షణ పంపిణీ వంటి విధానాల ద్వారా.. క్రౌడ్ మేనేజ్‌మెంట్‌ మరింత కట్టుదిట్టంగా మారుతుందని వెల్లడించారు. ఆలయ అధికారులు మాట్లాడుతూ.. ప్రతి భక్తుడికి ఉచిత ప్రసాదం తప్పకుండా అందేలా పర్యవేక్షణను పెంచుతామని, ప్రసాద పంపిణీ వ్యవస్థలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, దర్శన వ్యవస్థను భక్తులకు మరింత ఆహ్లాదకరంగా, ఆధ్యాత్మిక అనుభూతిని ఇచ్చేలా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.

ఇక, కొత్త ఏడాది సందర్భంగా అమలులోకి వచ్చిన ఈ మార్పులు.. భక్తులకు సులభమైన, వేగవంతమైన దర్శనం, ప్రసాదం ఇంద్రకీలాద్రి ప్రవేశద్వారంలోనే అందేలా చేయడంతో పాటు.. పూర్తి పారదర్శకతతో కూడిన వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చాయి. దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులు ఈ మార్పులను గమనించి, ఆలయ సూచనలను తప్పకుండా పాటించాలని దేవస్థానం విజ్ఞప్తి చేసింది.

Exit mobile version