Vangaveeti Radha: బెజవాడ మేయర్ అభ్యర్థి వంగవీటి రాధా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కమ్మ, కాపు సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, అయితే వారి చేష్టలను తాను పట్టించుకోనని స్పష్టం చేశారు. సామాజిక వర్గాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలకు ప్రాధాన్యం ఇవ్వబోనని స్పష్టం చేశారు. ఇక, ఏబీ వెంకటేశ్వరరావు తనకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని వంగవీటి రాధా పేర్కొన్నారు. ఆయనతో తనకు చిరకాల పరిచయం ఉందని తెలిపారు. మేయర్‌గా గెలిచిన తర్వాత ఏబీ వెంకటేశ్వరరావును కలిసి నగర అభివృద్ధికి సంబంధించి ఆయన సూచనలు తీసుకుంటానని చెప్పారు.
రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ నగర అభివృద్ధి విషయంలో అందరి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు వంగవీటి రాధా.. ఇక, విజయవాడ నగరంలో నీటి సమస్యతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.. నగర అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు.. ప్రజల సమస్యలను గుర్తించి వాటికి పరిష్కార మార్గాలు చూపాల్సిన అవసరం ఉందన్నారు వంగవీటి రాధా..
ఎమ్మెల్యే ఒక నియోజకవర్గానికి మాత్రమే పరిమితమవుతారని, కానీ మేయర్‌కు నగరంలోని మూడు నియోజకవర్గాలతో సంబంధాలు ఉంటాయని వంగవీటి రాధా అన్నారు. నగరవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో మేయర్ పాత్ర కీలకమని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో ఎమ్మెల్యేగా రెండుసార్లు పోటీ చేయకపోవడం గతమని, ప్రస్తుతం మేయర్‌గా పోటీకి దిగినట్లు రాధా పేర్కొన్నారు. కూటమిలోని అన్ని పార్టీల నాయకుల సహకారం తనకు ఉందని తెలిపారు. వారి సహకారంతో విజయవాడ నగర అభివృద్ధికి కృషి చేస్తాననే ధీమాను వ్యక్తం చేశారు బెజవాడ మేయర్ కూటమి అభ్యర్థి వంగవీటి రాధా ..

