Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. కండువా కప్పి ఆహ్వానించిన పవన్‌.. మేయర్ రేసులో..?

Vangaveeti Radha Joins Jana

Vangaveeti Radha Joins Jana

Vangaveeti Radha Joins Jana Sena: స్థానిక సంస్థల ఎన్నికల వేళ జనసేన పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకున్న రాధాకృష్ణకు పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ పార్టీ కండువా కప్పి సాదరంగా జనసేనలోకి ఆహ్వానించారు. అనంతరం పవన్ కల్యాణ్‌, వంగవీటి రాధాకృష్ణతో ప్రత్యేకంగా సమావేశమై వన్ టు వన్ చర్చలు జరిపారు.

కాగా, వంగవీటి రాధాకృష్ణ.. కాంగ్రెస్‌ పార్టీలో చేరి పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చారు.. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ ఈస్ట్‌ నుంచి పోటీ చేసి విజయం సాధించారు.. ఇక, 2008లో ప్రజా రాజ్యం పార్టీలో చేరిన ఆయన.. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి మరోసారి పోటీ చేసినా ఓటమిపాలయ్యారు.. మరోవైపు.. 2014 ఎన్నికల ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి మరోసారి ఓడిపోయాడు. 2015లో వైసీపీ విజయవాడ సిటీ ప్రెసిడెంట్‌గా పనిచేశారు.. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం టికెట్ దక్కకపోవడంతో క్రమంగా వైసీపీకి దూరమైన ఆయన.. 2019లో టీడీపీ గూటికి చేరారు.. తాజాగా జనసేనలో చేరడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. విజయవాడ నగర మేయర్ పదవి అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీలో ఉండటంతో, కూటమిలోని పార్టీల మధ్య సీట్ల సర్దుబాటులో ఈ పదవిని జనసేనకు కేటాయించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో జనసేన తరఫున విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ బరిలోకి దిగుతారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

మరోవైపు, తిరుపతికి చెందిన విద్యావేత్త ప్రణీత్ పెనుమాదు కూడా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. తిరుపతి మేయర్ పదవికి సంబంధించి ఆయన పేరు కూడా ప్రచారంలో వినిపిస్తోంది. దీంతో విజయవాడలో వంగవీటి రాధాకృష్ణ, తిరుపతిలో ప్రణీత్ పెనుమాదు మేయర్ రేసులో ఉంటారనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఈ పేర్లపై పార్టీ అధికారికంగా స్పష్టత ఇవ్వాల్సి ఉంది.