NTV Telugu Site icon

Vijayawada: విజయవాడ దుర్గగుడి పాలకమండలి నిర్ణయాలు ఇవే..

Indrakeeladri

Indrakeeladri

విజయవాడ: దుర్గగుడి పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రైల్వేస్టేషన్, బస్టాండ్‌‌ల్లో కౌంటర్లు ఏర్పాటు చేసి అమ్మవారి ప్రసాదం అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు పాలకమండలి చైర్మన్ కర్నాటి రాంబాబు తెలిపారు. సోమవారం దుర్గగుడి పాలకమండలి భేటీ అయింది. ఈ సమావేశానికి పాలకమండలి చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈవో రామారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

నిర్ణయాలు ఇవే..
పాలకమండలి నిర్ణయాలను కర్నాటి రాంబాబు మీడియాకు వివరించారు. ఎలివేటెడ్ క్యూలైన్ల ఏర్పాటు నిర్ణయాన్ని ఆమోదించినట్లు వెల్లడించారు. పూజా మండపాలు కొండపైన ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. శివాలయం అంతరాలయంలో ఏసీ, మండపం చుట్టూ లైటింగ్ ఏర్పాటకు నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. జనవరి 26న లక్షకు పైగా భక్తులు దర్శనం చేసుకున్నారని తెలిపారు. వీఐపీలు, వికలాంగులు, వృద్ధులు నివేదన సమయంలో ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటలలోపు దర్శనం ముగుస్తుందన్న విషయాన్ని భక్తులు గుర్తించాలని కోరారు.

త్వరలో పర్మిట్ తెచ్చుకుని గిరి ప్రదక్షిణ మార్గంలో బస్సు తిప్పాలని నిర్ణయించినట్లు కర్నాటి రాంబాబు తెలిపారు. ఘాట్ రోడ్డు మరమ్మత్తులు చేసేందుకు నిర్ణయించామన్నారు. అలాగే వచ్చే దసరా నాటికి మాస్టర్ ప్లాన్‌లో భాగంగా చేయబోయే పనులకు ఒక రూపం తెస్తామని వెల్లడించారు. అంతేకాకుండా కొండ చరియల అంశంపై దేవాశాఖ మంత్రితో కూడా చర్చించి త్వరలో పూర్తి చేస్తామని కర్నాటి రాంబాబు స్పష్టం చేశారు.