AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కాంపై సిట్ అధికారులు విచారణను వేగవంతం చేశారు. కేసుకు సంబంధించి ప్రైమరీ ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి ఒకవైపున కసరత్తులు చేస్తున్న అధికారులు.. మరోవైపున సేకరించిన సమాచారం ఆధారంగా నిందితులను కూడా అరెస్టు చేయటానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే లిక్కర్ స్కామ్‌కు సంబంధించి 40 మందిని నిందితులుగా చేర్చిన సిట్ 11 మందిని అరెస్టు చేసింది.. ఇందులో గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన అనుచర వర్గం రాజ్ కేశిరెడ్డి ఉన్నారు. వీరితో పాటు విజయసాయిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలను కూడా సిట్ నిందితులుగా చేర్చింది. కేసులో ఒకసారి విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి మరోసారి విచారణకు రావాలని సిట్ నోటీసులు ఇవ్వగా ఆయన తర్వాత వస్తానని గైర్హాజరయ్యారు.
Read Also: HCA Scam: సీఐడి విచారణకు కోర్టు గ్రీన్ సిగ్నల్.. ఆరు రోజుల కస్టడీకి అనుమతి..!
మరోవైపు, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఈ కేసులో తనకు ముందస్తు బెయిలు ఇవ్వాలని ఏపీ హైకోర్టును మొదట ఆశ్రయించారు. ఆ తర్వాత సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు.. సుప్రీంకోర్టు తిరిగి హైకోర్టుకు వెళ్లాలని సూచించడంతో హైకోర్టుకు వచ్చిన ఆయనకు చుక్కెదురైంది. మిథున్ రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్ ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. ఇది జరిగిన వెంటనే సిట్ అధికారులు అప్రమత్తమై విదేశాలకు మిథున్ రెడ్డి వెళ్లకుండా లుక్‌అవుట్ సర్క్యూలర్ నోటీసులు జారీ చేశారు. ఆయనపై సిట్ అధికారులు నిఘా పెట్టినట్టుగా సమాచారం. మిథున్ రెడ్డి పిటిషన్ విచారణ సమయంలో కూడా సిట్ అధికారులు కోర్టుకి కొన్ని కీలక వివరాలు తెలిపారు. స్కామ్ లో కొంత డబ్బు మిథున్ రెడ్డికి సంబంధించిన కంపెనీలకు వెళ్లినట్టుగా ఆధారాలు ఉన్నట్టుగా కోర్టుకు తెలిపారు. స్కాంలో మిథున రెడ్డి పాత్ర ఉందని పదే పదే చెప్పిన సిట్ ఇప్పుడు ఆయనను అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
Read Also: India vs NATO: వాణిజ్యంపై భారత్ని హెచ్చరించడానికి నాటో చీఫ్ ఎవరు..?
లిక్కర్స్ స్కాం కేసుకు సంబంధించి సిట్ అధికారులు విచారణను కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటికే అరెస్టు అయిన కేసులో ఏ1 రాజ్ కేశిరెడ్డి అరెస్టై ఈనెల 22తో 90 రోజులు పూర్తి చేసుకోనున్నారు. ఆ తర్వాత వారం రోజులు వ్యవధిలో మరి కొంతమంది నిందితులు కూడా అరెస్టు జరిగి 90 రోజులు పూర్తవుతుంది. ఈలోపుగా ఛార్జిషీట్ దాఖలు చేయకపోతే వీళ్ళందరికి బెయిల్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తుదిదశకు కేసును తీసుకెళ్లే ప్రయత్నాల్లో భాగంగా మిథున్ రెడ్డి మీద కూడా పోలీసులు ఫోకస్ పెట్టి ఛార్జ్ షీట్ దాఖలు చేసేలోగా అరెస్ట్ చేస్తారనే చర్చ జరుగుతుంది. అందులో భాగంగానే ఆయనపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారని.. ఆయనకు కదలికలను గమనిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ప్రైమరీ ఛార్జి షీట్ దాఖలు చేసి తర్వాత ఇంకా కొంత మందిని నిందితులుగా అదనంగా చేర్చడంతో పాటు అరెస్టులు కూడా ఉంటాయి.. కాబట్టి వాటితో కలిపి ఫైనల్ ఛార్జిషీట్ వేయటం ద్వారా కేసు దర్యాప్తును ముగించాలని అధికారులు చూస్తున్నారు.. మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత మరింత వేగంగా.. మిగతా వారి పాత్రను గుర్తించవచ్చే ఆలోచనలో సిట్ ఉంది.
