Site icon NTV Telugu

Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం.. జోగి బ్రదర్స్ కుమారులకు నోటీసులు..

Fake Liquor Case

Fake Liquor Case

Fake Liquor Case: ఓ వైపు ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసు సంచలనంగా మారిన వేళ.. మరోవైపు నకిలీ మద్యం వ్యవహారం కలకలం రేపింది.. అయితే, విజయవాడలో నకిలీ మద్యం తయారీ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా అధికారులు మాజీ మంత్రి జోగి రమేష్‌ కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే నకిలీ లిక్కర్‌ కేసులో మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జోగి రమేష్‌ తో పాటు ఆయన సోదరుడు జోగి రామును కూడా అరెస్ట్ చేశారు.. అయితే, తాజాగా, ఈ కేసులో జోగి బ్రదర్స్‌ కుమారులకు నోటీసులు అందజేశారు ఎక్సైజ్‌ పోలీసులు.. ఎక్సైజ్ శాఖ పంపిన నోటీసుల ప్రకారం విచారణకు హాజరుకావాల్సిన వారు.. జోగి రమేశ్ కుమారుడు జోగి రాజీవ్, జోగి రోహిత్.. జోగి రాము కుమారుడు రాకేష్, రామ్మోహన్ ఉన్నారు.. ఈ నలుగురు విజయవాడ ఎక్సైజ్ కార్యాలయంలో ఎల్లుండి ఉదయం విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు అధికారులు..

Read Also: Hyderabad Metro : మెట్రోలో మహిళల భద్రతకు నూతన అడుగు

నకిలీ మద్యం తయారీ, నిల్వ, రవాణా మరియు పంపిణీ వ్యవహారంలో కీలక ఆధారాలు లభించడంతో విచారణను వేగవంతం చేసినట్టు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్టు కాగా.. అధికారులు కీలక అనుమానితుల ఆస్తి మరియు లావాదేవీలను కూడా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఈ కేసుతో సంబంధం ఉన్న మరిన్ని ప్రముఖులు కూడా దర్యాప్తులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.. మొత్తంగా ఇప్పటికే మాజీ మంత్రి జోగి రమేష్‌, ఆయన సోదరుడు జోగి రాము అరెస్ట్‌ కావడం.. ఇప్పుడు జోగి బ్రదర్స్‌ కుమారులు నలుగురికి నోటీసులు అందజేయడం చర్చగా మారింది.. కాగా, నకిలీ మద్యం తయారీ కేసులో అరెస్ట్‌ అయిన జోగి రమేష్‌, ఆయన సోదరుడు జోగి రామును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. నాలుగు రోజుల పాటు ప్రశ్నించిన విషయం విదితమే.. నాలుగు రోజుల్లో మొత్తం 250 ప్రశ్నలు అడిగినట్టుగా తెలుస్తుంది.. అయితే, ప్రతి ప్రశ్నకూ దాటవేత ధోరణిలోనే సమాధానాలిచ్చారట…

Exit mobile version