Chicken and Egg Prices: నాన్‌వెజ్ ప్రియులకు ధరల షాక్.. భారీగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు

Chickens And Eggs Ban

Chickens And Eggs Ban

Chicken and Egg Prices: నాన్‌వెజ్ ప్రియులకు మరోసారి ధరల షాక్ తగిలింది. చికెన్, కోడిగుడ్ల ధరలు ఒక్కసారిగా పెరగడంతో సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం పడుతోంది. డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా లేకపోవడం, కోళ్ల ఫారాల్లో ఉత్పత్తి తగ్గడం వల్ల మార్కెట్లో ధరలు గణనీయంగా పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. విజయవాడలో ప్రస్తుతం కిలో చికెన్ ధర రూ.298కు చేరువగా ఉంది. డ్రెస్డ్ చికెన్ ధర కిలోకు రూ.264గా ఉండగా, ఫారం వద్ద లైవ్ బర్డ్ ధర రూ.143, రిటైల్ మార్కెట్లో రూ.170 వరకు పలుకుతోంది. గత కొద్ది వారాల్లోనే చికెన్ ధర కిలోకు సుమారు రూ.50 వరకు పెరగడం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది.

అటు కోడిగుడ్ల ధరలు కూడా భారీగా పెరిగాయి. ప్రస్తుతం డజను గుడ్ల ధర రూ.100కు చేరుకోవడంతో కుటుంబాల నెలవారీ ఖర్చులు మరింత పెరిగాయి. నాన్‌వెజ్ ఆహారాన్ని ఇష్టపడే వారికి ఈ ధరల పెరుగుదల పెద్ద సవాల్‌గా మారింది. ధరలు మరికొంత కాలం ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఉత్పత్తి పెరిగి సరఫరా సాధారణ స్థితికి చేరుకున్న తర్వాతే ధరలు తగ్గే అవకాశముందని చెబుతున్నారు. కాగా, తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు కిలో చికెన్ 300 రూపాయలకు చేరువగా వెళ్లింది.. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే రూ.300కు కిలో విక్రయిస్తున్నారు.. ఇక, హోల్‌ సెల్‌లో కోడి గుడ్ల ధర రూ.6.30 పలుకుతుండగా.. రిటైల్‌ మార్కెట్‌కు వచ్చే సరికి దాని ధర రూ.8.50కు చేరి సామాన్యుల జేబుకు చిల్లు పెడుతుంది..