AP Panchayat Elections Phase 2: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల సందడి కొనసాగుతూనే ఉంది.. ఇక, ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో తొలి విడత నోటిఫికేషన్ విడుదల కావడంతో.. ఆ ప్రక్రియ వేగంగా కొనసాగుతుండగా.. ఈ రోజు పంచాయతీ ఎన్నికల రెండో దశకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 21వ తేదీన ఉదయం 8 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ప్రారంభమవుతుంది.
ఇక, నామినేషన్లు తిరస్కరణకు గురైన అభ్యర్థులు ఈ నెల 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అప్పీల్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 23వ తేదీన అప్పీళ్లను పరిష్కరించనున్నారు. అనంతరం 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు అధికారులు.. మరోవైపు.. ఈ నెల 29వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పంచాయతీ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. అనంతరం ఉపసర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహించనున్నారు. అవసరమైన ప్రాంతాల్లో ఈ నెల 30వ తేదీన రీపోలింగ్ నిర్వహించి ఫలితాలను ప్రకటించనున్నారు. దీంతో రెండో దశ పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు షెడ్యూల్ ఖరారు చేసింది ఎస్ఈసీ…

