AP Liquor Case: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. సిట్ విచారణకు మాజీ ఐఏఎస్

Rajat Bhargava

Rajat Bhargava

AP Liquor Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన ఏపీ లిక్కర్ స్కాం కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. గత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖ స్పెషల్ సీఎస్‌గా పనిచేసిన రజత్ భార్గవను మద్యం పాలసీకి సంబంధించిన పలు అంశాలపై సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చినా.. రజత్ భార్గవ అడ్డుకోలేదన్నది ప్రధాన ఆరోపణగా ఉంది. ఎక్సైజ్ శాఖలో ప్రైవేట్ వ్యక్తుల జోక్యం, ఆర్డర్ ఫర్ సేల్ (OFS) వ్యవహారాల్లో అక్రమాలు, కొన్ని లిక్కర్ బ్రాండ్లకు సంబంధించిన అవకతవకలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేయలేదని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. మద్యం కొనుగోళ్లు, OFS ప్రక్రియలో అవకతవకలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఈడీ గతంలోనూ వెల్లడించింది.

ఇదిలా ఉండగా, లిక్కర్ స్కాం కేసులో సిట్ విచారణకు రజత్ భార్గవ గతంలో పలుమార్లు గైర్హాజరైనట్లు సమాచారం. ఈ నెల 24న విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు ఆదేశించినప్పటికీ ఆయన హాజరు కాలేదని పేర్కొంటున్నారు. తాజాగా విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని సిట్ అధికారులు స్పష్టం చేయడంతో ఆయన విచారణకు హాజరయ్యారు. మరోవైపు, గత ప్రభుత్వంలో ఎక్సైజ్ కమిషనర్‌గా పనిచేసిన వివేక్ యాదవ్ స్టేట్‌మెంట్‌ను సిట్ అధికారులు ఇప్పటికే నమోదు చేసినట్లు సమాచారం. ఇప్పుడు రజత్ భార్గవ నుంచి సిట్ అధికారులు ఏ అంశాలపై సమాచారం సేకరిస్తారన్నది దర్యాప్తులో కీలకంగా మారింది.. ఇప్పటికే ఎన్నో మలుపు తిరిగుతూ వస్తున్న ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఇప్పుడు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది..