విజయవాడ వేదికగా జరుగుతున్న సంస్కృతి, సంప్రదాయాల వేడుక ‘విజయవాడ ఉత్సవ్-2.0’ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈ ఉత్సవంలో భాగంగా నిర్వహించిన మెగా కార్నివాల్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాచవరం ఎస్ఆర్ఆర్ కాలేజీ నుంచి స్టేడియం వరకు సాగిన ఈ భారీ మెగా కార్నివాల్లో సీఎం చంద్రబాబు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు బోండా ఉమ, వెనిగండ్ల రాము, ఎమ్మెల్సీ వర్ల రామయ్యతో పాటు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు.
ప్రపంచం చూసి గర్వపడేలా విజయవాడ ఉత్సవాలు: సీఎం చంద్రబాబు
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. విజయవాడ ఉత్సవ్‌ను దేశం మొత్తం గుర్తుంచుకునేలా అద్భుతంగా నిర్వహించామని కొనియాడారు. ఇది విజయవాడలో జరుగుతున్న మూడో ఉత్సవమని, రాబోయే రోజుల్లో ప్రపంచమే చూసి గర్వపడేలా ఈ వేడుకలను తీర్చిదిద్దుతామని చెప్పారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రజల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయని, స్థానిక కళాకారులకు తగిన అవకాశాలు కల్పించడం అభినందనీయమన్నారు. ఒకవైపు ‘విజయవాడ ఉత్సవ్’, మరోవైపు ‘సరస్’ మేళా ఒకే సమయంలో జరగడం విశేషమని పేర్కొన్నారు. ప్రభుత్వాలు కేవలం సంక్షేమం, అభివృద్ధి మాత్రమే కాకుండా మన సంస్కృతి, సంప్రదాయాలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు.
రీల్స్ కాలంలో ఇలాంటి ఉత్సవాలు ఎంతో అవసరం
నేటి ఆధునిక ఉరుకులు పరుగుల జీవితంలో ప్రజలు సోషల్ మీడియాలో గంటల తరబడి రీల్స్ చూస్తూ గడుపుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నేటి డిజిటల్ యుగంలో టెక్నాలజీ ఎంత ముఖ్యమో, మనశ్శాంతిని ఇచ్చే ఆధ్యాత్మికత కూడా అంతే అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది శ్రీదుర్గమ్మ దర్శనానికి గతంలో కంటే అదనంగా రెండు లక్షల మంది భక్తులు వచ్చారని తెలిపారు. దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతితో పాటు ఇద్దరు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు విజయవాడను సందర్శించారని గుర్తుచేశారు. మన కళలు, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక వైభవాలను ప్రపంచానికి చాటిచెప్పాలని పిలుపునిచ్చారు.
భయాలు వీడి పండగ వాతావరణం.. రాష్ట్రంలో మహిళలకు ఉచిత ప్రయాణం
గతంలో రాష్ట్రంలో నెలకొన్న భయానక వాతావరణాన్ని గుర్తుచేస్తూ.. నేడు ప్రజలంతా స్వేచ్ఛగా, పండగ వాతావరణంలో వేడుకలు జరుపుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి వారి ప్రయాణాన్ని సులభతరం చేశామని గుర్తుచేశారు. రాష్ట్రంలో కళలను ప్రోత్సహించడానికి, సంప్రదాయాలను పరిరక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని, ఇలాంటి కార్యక్రమాలకు సంపూర్ణ సహకారం అందిస్తుందని సీఎం స్పష్టం చేశారు.

