Site icon NTV Telugu

Vijayawada Adulterated Chicken: వామ్మో కుళ్ళిన మాంసం.. విజయవాడలో అధికారుల తనిఖీలు

Kalti Chicken

Kalti Chicken

వ్యాపారులు రెచ్చిపోతున్నారు.. జనం ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. కుళ్ళిన మాంసం అమ్ముతూ జనం ప్రాణాల మీదకు తెస్తున్నారు. ముక్కలేనిదే ముద్ద దిగని వారికి ఇది గొంతు దిగని వార్త. బెజవాడ నాన్ వెజ్ మార్కెట్ లో కుళ్ళిన మాంసం విక్రయిస్తున్న వ్యాపారులపై అధికారులు ఉక్కుపాదం మోపారు. సండే కావటంతో నాన్ వెజ్ మార్కెట్ లో తనిఖీలు కొనసాగుతున్నాయి. విజయవాడలో వీఎంసీ అధికారుల తనిఖీలు ముమ్మరం చేశారు. కుళ్ళిన మాంసాన్ని విక్రయిస్తున్నారన్న సమాచారంతో కొత్తపేట మార్కెట్ లో తనిఖీ చేశారు మున్సిపల్ కార్పొరేషన్ వెటర్నరీ సర్జన్ డాక్టర్ రవిచంద్ర.

ఆయన తనిఖీల్లో నివ్వెర పోయే నిజాలు బయటపడ్డాయి. మాచవరం, బీఆర్టీఎస్ రోడ్డు, ప్రకాష్ నగర్ లోని మార్కెట్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి. మాచవరంలో 5కేజీల కుళ్ళిన మాంసాన్ని విక్రయిస్తున్న వ్యాపారిపై కేసు నమోదు చేశారు వీఎంసీ అధికారులు. వారం వారం ఇలాంటి అమ్మకాలు యథేచ్ఛగా కొనసాగుతూనే వున్నాయి. వారం క్రితం కొత్తపేట హనుమంతరాయ మార్కెట్‌లో అధికారులు తనిఖీలు చేపట్టారు. పలు మాంసం దుకాణాల్లో కుళ్లిపోయిన మాంసం విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు.

Read Also: Legionnaires Disease: అర్జెంటీనాలో లెజియోనైర్స్ వ్యాధి కలకలం.. నలుగురి మృతి

సుమారు 100 కేజీల కుళ్లిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తనిఖీల్లో కేజీల కొద్దీ కుళ్ళిన మాంసం బయట పడడంతో వినియోగదారులు ఆందోళనకు గురయ్యారు. ప్రజల ఆరోగ్యాలతో వ్యాపారం చేస్తున్న వ్యాపారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తనిఖీలు నామమాత్రంగా కాకుండా నిరంతరం కొనసాగించాలని, మాంసం దుకాణాల దగ్గర హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేయాలని వినియోగదారులు కోరుతున్నారు. ఫ్రిజ్ లలో నిల్వ వున్న మటన్, చికెన్ కొనుగోలు చేయవద్దని, ఖరీదు ఎక్కువైనా ఫ్రెష్ గా వున్నవాటినే కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

హోల్ సేల్ మటన్ వ్యాపారులు కూడా ఇలాంటి వాటిపట్ల జాగ్రత్తగా వుండాలని సూచిస్తున్నారు. తక్కువ ధరకు మటన్, చికెన్ విక్రయిస్తున్న వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కొంతమంది మటన్ వ్యాపారస్థులు చనిపోయిన మేకలు 3 వేలకు 4 వేలకు కొనుగోలు చేసి తక్కువకు విక్రయిస్తున్నారని, ఇలాంటి వారి సమాచారం తెలిస్తే అధికారులకు అందచేయాలంటున్నారు. మొత్తం మీద మటన్, చికెన్ ప్రియులకు కొందరు కేటుగాళ్ళు టోకరా వేస్తున్నారు. కల్తీ మాంసం తిని అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్తగా వుండాల్సిన అవసరం ఎంతైనా వుంది.

Read Also: Mohammad Rizwan: వామ్మో.. భారత్‌తో మ్యాచ్ అంటేనే..

Exit mobile version