NTV Telugu Site icon

Vijayasai Reddy: రాష్ట్ర ప్రయోజనాలే వైసీపీకి ముఖ్యం.. మోడీ సభను రాజకీయం చేయొద్దు

Vijayasai Reddy Modi Tour

Vijayasai Reddy Modi Tour

Vijayasai Reddy On PM Narendra Modi Vizag Tour: తమ వైసీపీ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, అందుకే తాము కేంద్రంతో సఖ్యతగా ఉంటున్నామని ఎంపీ విజయసాయి రెడ్డీ స్పష్టం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలను అభివృద్ధి చేయాలన్నదే వైసీపీ లక్ష్యమని, ఆ ఆలోచనతోనే తాము రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ముకు మద్దతు ఇచ్చామని తెలిపారు. విశాఖలో ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభ కోసం ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు. ఈనెల 11వ తేదీన ప్రధాని విశాఖకు రానున్నారని, 12న బహిరంగ సభ జగనుందని వెల్లడించారు. ఈ సభను విజయవంతం చేసేందుకు.. సీఎం జగన్ ఆదేశాల మేరకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కమిటీలో జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలు సభ్యులుగా ఉంటారని అన్నారు.

ఏయూలోని రెండు ఇంజనీరింగ్ గ్రౌండ్స్‌లో 29 ఎకరాల్లో ప్రధాని మోడీ బహిరంగ సభ‌కు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా విజయసాయి రెడ్డి క్లారిటీ ఇచ్చారు. క్రీడా అవసరాలకు తగ్గట్టు మైదానాన్ని సిద్ధం చేస్తున్నామని.. ప్రధాని హెలికాప్టర్ కోసం ఏయూ ఇంకుబేషన్ సెంటర్ వద్ద ఏర్పాట్లు చేపబడుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ బహిరంగ సభకు రెండు లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నామన్నారు. ప్రధాని ఏ రాష్ట్రానికి వస్తారో, అయా రాష్ట్ర ప్రభుత్వాలు తప్పకుండా సహకరించాల్సి ఉంటుందని.. తామూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ విశాఖ పర్యటనలో భాగంగా మోడీ రూ. 12 వేల కోట్ల అభివృద్ధి పనుల్ని ప్రారంభిస్తారన్నారు. ఇందులో రాజకీయ కోణాలు చూడకూడదని, అనవసరమైన రాద్ధాంతాలకు తెరలేపొద్దని ప్రతిపక్షాల్ని కోరారు.

విశాఖ నుంచి పరిపాలన సాగుతుందని.. రాజధాని అంశం అమలవ్వడం ఖాయమని విజయసాయి రెడ్డి చెప్పారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా.. విశాఖ రాజధాని కావడాన్ని అడ్డుకోలేరన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ విషయంలో వైసీపీ కట్టుబడి ఉందని, స్టీల్ ప్లాంట్ కార్మికుల పక్షాన తమ పార్టీ ఎప్పటికీ ఉంటుందని హామీ ఇచ్చారు. తమ వైసీపీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని మరోసారి విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు.