Site icon NTV Telugu

తాడు బొంగరం లేనివారే తమాషాలు చేస్తారు.. విజయసాయి సెటైర్లు

ఒకవైపు టీడీపీ అధినేత చంద్రబాబు దీక్ష.. దీనికి ప్రతిగా వైసీపీ ప్రజాగ్రహ దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ కార్యాలయాలపై దాడి జరిగితే రాష్ట్ర బంద్ చేస్తారా అని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన రీతిలో ట్వీట్లు చేశారు. జగన్ గారి హుందాతనాన్ని బలహీనతగా తీసుకోవద్దని, ప్రతి ఎన్నికల్లో చిత్తుగా ఓడారన్నారు విజయసాయిరెడ్డి.

టీడీపీ నేత‌ల‌పై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి తనదైన రీతిలో మండిప‌డ్డారు. అనుచిత వ్యాఖ్య‌లు చేస్తూ ఉనికిని చాటుకునేందుకు ఆ పార్టీ నేత‌లు ప్ర‌య‌త్నిస్తున్నారంటూ ఆయ‌న ప‌రోక్షంగా ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. ‘సీఎం జగన్ గారి హుందాతనాన్ని బలహీనతగా తీసుకోవద్దు. ప్రతి ఎన్నికల్లో చిత్తుగా ఓడారు. 2 వారాల్లో బద్వేలులో కూడా మీ బతుకేమిటో తెలిసిపోతుంది. ప్రజలు దేవుడిగా ఆరాధిస్తున్న వ్యక్తిపై దిగజారుడు భాషను ఉపయోగిస్తే తోపులైపోరు. జనం మధ్యకు వెళ్లాలి గాని పార్టీ ఆఫీసుల్లో ఏం పని?’ అని ఆయ‌న ట్విట్ట‌ర్‌లో ప్ర‌శ్నించారు.

‘సంక్షేమ పాలన చూసి ఓర్వలేక అడ్రస్ గల్లంతవుతుందని విపక్షం అడ్డదారులు తొక్కుతోంది. బూతులు తిడుతూ రాజకీయం చేస్తే ప్రజలు హర్షించరు. రెచ్చగొట్టే విద్వేష రాజకీయాలకు కాలం చెల్లింది. తాడు బొంగరం లేని వారు తమాషా చేస్తారు. క్యాడర్ అప్రమత్తంగా ఉండాలి’ అని ఆయ‌న పేర్కొన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు, ఆరోపణలు సహజం. అవన్నీ ప్రజల మేలు కోరుతూ, వారి కేంద్రంగానే జరగాలి. కానీ వెంటిలేటర్ పై ఉన్న తెలుగుదేశం పార్టీ బూతులకు తెగబడుతుంది. ఈ బరితెగింపునకు భారీ మూల్యం చెల్లించక తప్పదన్నారు విజయసాయి రెడ్డి.

Exit mobile version