NTV Telugu Site icon

చట్టసభల్లో నేతల ప్రవర్తనపై వెంకయ్య ఆవేదన

మనల్ని పాలించే నేతలు ఎలా వుండాలి? వారి ప్రవర్తన ఎలా వుండాలి? అనేదానిపై ప్రజలు ఆలోచించాలన్నారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. విజయవాడలో విద్యార్థులతో ముఖాముఖి లో వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులను ఎన్నుకునే ముందు కులం మతం చూసి ఎన్నుకోకూడదన్నారు. నేతల కులం కన్నా గుణం మిన్న అన్నారు వెంకయ్యనాయుడు.

మంచి వారిని సేవా భావం ఉన్న వారిని ప్రోత్సహించాలి నాయకుడిగా ఎన్నుకోవాలి. పార్లమెంట్ కి అసెంబ్లీకి పోయి మాట్లాడేటప్పుడు సభ్యతతో సంస్కారంతో మాట్లాడే నాయకుల్ని మనం ఎన్నుకోవాలి. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు అసభ్యకర పదజాలంతో మాట్లాడే విధానం. అలాంటివి చూస్తుంటే చాలా బాధేస్తుంది. వింటే అసహ్యం కూడా కలుగుతుందన్నారు. కులాలు మతాలు వేరు చేసి చీల్చే వారికి దూరంగా ఉండాలని విద్యార్ధులకు పిలుపు నిచ్చారు. కులాలు ఎన్నైనా మనందరం ఒక్కటే అనే భావన ఎప్పుడు వస్తుందో అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు.