అమరావతి : దేవదాయ శాఖలో వీలైనంత త్వరలో ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించారు మంత్రి వెలంపల్లి శ్రీనివాస్. దేవదాయ శాఖపై ఇవాళ మంత్రి వెలంపల్లి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ… దేవదాయ శాఖలో నాడు-నేడు తరహాలో ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని… దేవాలయాలను పెద్ద ఎత్తున అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. దేవదాయ శాఖలో ఇతర శాఖల అధికారులను నియమించక తప్పని పరిస్థితి ఉందని… ఇతర శాఖలకు చెందిన హిందువులను మాత్రమే దేవదాయ శాఖలో నియమిస్తామని తెలిపారు.
దేవదాయ శాఖ భూములను లీజు తీసుకుని చట్టంలోని లొసుగులను ఆసరా చేసుకుని లీజు ఎగ్గొడుతున్నారని… దేవదాయ శాఖలో లీజు ఎగొట్టే వారి జాబితాను సిద్దం చేస్తున్నామన్నారు. లీజు ఎగొట్టే వారి నుంచి అవసరమైతే భూములు వెనక్కు తీసుకునేలా చర్యలు తీసుకుంటామని… దేవాదాయ శాఖలో గతంలో ఎన్నడూ జరగని విధంగా మార్పులు చేర్పులు చేశామని స్పష్టం చేశారు. దేవదాయ భూములను కాపాడేందుకు చట్ట సవరణలు సహా అనేక నిర్ణయాలు తీసుకున్నామని… దేవదాయ శాఖలోని విజిలెన్స్ సెల్ ని మరింత బలోపేతం చేయనున్నామన్నారు మంత్రి వెల్లంపల్లి. దేవాలయాల్లో 100 శాతం సీసీ కెమెరాలు పెట్టేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
