NTV Telugu Site icon

Vasireddy Padma: మహిళలకు ప్రేమించే హక్కు, నిరాకరించే హక్కు రెండూ ఉంటాయి

Vasireddy Padma

Vasireddy Padma

Vasireddy Padma: ఏపీలో కృష్ణా జిల్లాకు చెందిన మెడికో విద్యార్థిని హత్య కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ ఈ అంశంపై స్పందించారు. మెడికో విద్యార్థిని హత్య దారుణమని.. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్ స్నేహాలు విషాన్ని చిమ్ముతున్నాయని ఇప్పటికైనా యువత తెలుసుకోవాలని ఆమె సూచించారు. సోషల్ మీడియాలో పుట్టే ప్రేమలను మనం అంచనా వేయలేమని అభిప్రాయపడ్డారు. ప్రేమ పేరుతో యువకుడు వేధిస్తున్నట్లు తపస్వి ఒక్కమాట కూడా చెప్పలేదని తల్లిదండ్రులు అంటున్నారని.. పథకం ప్రకారమే మెడికో తపస్విని జ్ఞానేశ్వర్ హత్య చేశాడని వాసిరెడ్డి పద్మ అన్నారు.

Read Also: Nithin: భార్యకు విడాకులు ఇవ్వనున్న నితిన్.. కానీ..?

మహిళలకు ప్రేమించే హక్కు ఉన్నప్పుడు నిరాకరించడం అనే హక్కు కూడా ఉంటుందని.. అంతమాత్రానికే మహిళలను చంపేస్తారా అని వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో నిందితుడు జ్ఞానేశ్వర్‌పై పోలీసులకు తపస్వి ఫిర్యాదు మాత్రమే ఇచ్చిందని.. కౌన్సిలింగ్ ఇస్తే చాలని పోలీసులతో చెప్పిందని వాసిరెడ్డి పద్మ చెప్పారు. కానీ అతడు ఆమెపై కక్ష పెంచుకుని హత్య చేసే వరకు వెళ్లడం దురదృష్టకరమన్నారు. మనిషి స్వభావం ఇన్‌స్టాగ్రామ్ ఫ్రెండ్ షిప్ ద్వారా అంచనా వేయలేమన్నారు. ఒక్క దారుణం వల్ల రెండు కుటుంబాలు తీవ్రంగా‌ వేదన అనుభవించాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికైనా యువతలో మార్పు రావాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. కాగా మెడికల్ విద్యార్థి తపస్వి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుంటూరు నుంచి విజయవాడకు తరలించారు. రేపు సాయంత్రం వరకు విజయవాడ సిద్ధార్థ కళాశాల ఫ్రీజింగ్ ల్యాబ్‌లో మృతదేహాన్ని భద్రపరిచేందుకు ఏర్పాట్లు చేశారు. తపస్వి సోదరి విదేశాల నుండి బుధవారం సాయంత్రానికి విజయవాడ వచ్చే అవకాశం ఉందని.. ఎల్లుండి కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలం కృష్ణాపురంలో తపస్వి మృతదేహానికి అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

Show comments