ఏపీలో మహిళలపై జరుగుతున్న వరుస అఘాయిత్యాలపై టీడీపీ నేత, తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా కడప జిల్లా ప్రొద్దుటూరులో బాలికపై గ్యాంగ్ రేప్ ఘటనపై ఆమె స్పందించారు. రాష్ట్రంలో ఆడబిడ్డల మాన ప్రాణాలకు రక్షణ కరువైందని వంగలపూడి అనిత ఆరోపించారు. జగన్ ఏపీలోని అక్క చెల్లెమ్మలతో ఓట్లు వేయించుకుని సీఎం అయ్యాక అత్యాచారాలు, హత్యలు, దాడులు జరిగినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. రాష్ట్రంలో అత్యాచారాలకు ఎల్లప్పుడూ కామాయేనా.. ఫుల్‌స్టాప్ పడేదెప్పుడు అని ప్రశ్నించారు.
మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు వైసీపీ ప్రజాప్రతినిధుల వైఫల్యం, ప్రభుత్వ నిర్లక్ష్యం, సీఎం జగన్ బాధ్యతా రాహిత్యమే నిదర్శనమని వంగలపూడి అనిత విమర్శలు చేశారు. అత్యాచారాలపై పోలీసు శాఖతో, డీజీపీతో సమీక్షలు జరిపిన దాఖలాలు లేవన్నారు. అత్యాచారాలు యాధృచ్ఛికమని హోంమంత్రి తానేటి వనిత మాట్లాడటం ముమ్మాటికీ బాధ్యతా రాహిత్యమేనని మండిపడ్డారు. టీడీపీ నేత నారాయణను అరెస్టు చేయడం కొండను తవ్వి ఎలుకను పట్టడమేనని వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. తల్లి, చెల్లికి న్యాయం చేయలేని జగన్ సామాన్యులకేం చేయగలడని నిలదీశారు. రాష్ట్రంలో గన్ కల్చర్ వచ్చినా అఘాయిత్యాలు జరిగినా జగన్ బయటకు రాడని.. జగన్‌కు భజన చేసి మంత్రులైనవారు ఇప్పటికైనా అత్యాచారాలపై స్పందించాలని హితవు పలికారు.