Vande Bharat Sleeper : ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్.. 16 గంటల్లోనే ముంబై..

  • బెంగళూరు–ముంబై మధ్య కొత్త వందే భారత్ స్లీపర్ రైలు
  • అనంతపురం, గుంతకల్లులో రైలు హాల్ట్
  • 16 గంటల్లోనే ముంబై నుంచి బెంగళూరుకు ప్రయాణం
  • 823 బెర్త్‌లు.. మూడు తరగతుల్లో టికెట్ ధరల వివరాలు
Vande Bharat Sleeper

Vande Bharat Sleeper

రైల్వే ప్రయాణికులకు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారతీయ రైల్వే శాఖ అదిరిపోయే గుడ్ న్యూస్ అందించింది. ఇప్పటికే రాష్ట్రంలో వివిధ మార్గాల్లో వందే భారత్ చైర్ కార్ సర్వీసులు అందుబాటులో ఉండగా, ఇప్పుడు సరికొత్త హంగులతో దేశంలోనే మూడోదిగా నిలిచిన వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బెంగళూరులో ఈ అత్యాధునిక రైలును అధికారికంగా ప్రారంభించారు. బెంగళూరు నుంచి ముంబై మధ్య రాకపోకలు సాగించనున్న ఈ రైలు మార్గమధ్యలో ఏపీలోని అనంతపురం, గుంతకల్లు స్టేషన్లలో ఆగుతుండటం విశేషం.

16 గంటల్లోనే ముంబై టూ బెంగళూరు జర్నీ.. టైమ్ షెడ్యూల్ ఇదే

సాధారణ రైళ్లలో ముంబై నుంచి బెంగళూరు చేరుకోవడానికి దాదాపు 22 గంటల సమయం పడుతుండగా, ఈ వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ ద్వారా కేవలం 16 గంటల్లోనే గమ్యస్థానానికి చేరుకోవచ్చు. కర్ణాటక, మహారాష్ట్రలను అనుసంధానించే ఈ రైలు మార్గమధ్యలో అనంతపురం, గుంతకల్, రాయచూర్, యాద్గిర్, కలబురిగి, సోలాపూర్, పూణే, కళ్యాణ్ సహా మొత్తం 8 స్టేషన్లలో ఆగనుంది. ముంబై-బెంగళూరు (27651) రైలు ముంబైలో రాత్రి 10.10 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు గుంతకల్లుకు, 8.38 గంటలకు అనంతపురంకు చేరుకుని మధ్యాహ్నం 12 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. ఈ రైలు మంగళవారం మినహా వారంలో 6 రోజులు సేవలు అందిస్తుంది. అలాగే తిరుగు ప్రయాణంలో బెంగళూరు-ముంబై (27652) రైలు బెంగళూరులో రాత్రి 7.45 గంటలకు బయల్దేరి రాత్రి 10.28 గంటలకు అనంతపురంకు, 11.20 గంటలకు గుంతకల్లుకు చేరుకుంటుంది. ఈ సర్వీసు సోమవారం మినహా వారంలో 6 రోజులు నడుస్తుంది.

అత్యాధునిక సదుపాయాలు.. టికెట్ ధరల వివరాలు

ఈ వందే భారత్ స్లీపర్ రైలులో మొత్తం 16 ఏసీ కోచ్‌లు ఉండగా, ప్రయాణికుల కోసం మొత్తం 823 సౌకర్యవంతమైన బెర్త్‌లను ఏర్పాటు చేశారు. రాత్రి సమయాల్లో సుదీర్ఘ ప్రయాణాలు చేసేవారికి ఈ స్లీపర్ కోచ్‌లు ఎంతో సౌకర్యంగా ఉండనున్నాయి. ఇక టికెట్ ధరల విషయానికి వస్తే.. బెంగళూరు నుంచి ముంబైకి రైల్వేశాఖ థర్డ్ ఏసీ (3AC)కి రూ.2,810, సెకండ్ ఏసీ (2AC)కి రూ.3,630, అలాగే ఫస్ట్ ఏసీ (1AC)కి రూ.4,450 చొప్పున ధరలను నిర్ణయించింది. ఏపీకి చెందిన ప్రయాణికులు ఈ సరికొత్త సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు కోరుతున్నారు.