ఏపీలోని అధికార పార్టీ వైసీపీలో గన్నవరం రచ్చ కొనసాగుతోంది. రెండు రోజుల నుంచి వల్లభనేని వంశీ, దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు వర్గాలు కత్తులు నూరుకుంటున్నాయి. ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి. వైసీపీలో వంశీ వర్సెస్ దుట్టా, వంశీ వర్సెస్ యార్లగడ్డ వర్గాలుగా చీలిక కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావుపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నిప్పులు చెరిగారు.
దుట్టా రామచంద్రరావు పెద్ద మనిషి అని గౌరవించానని.. కానీ ఆయన హద్దు మీరి మాట్లాడుతున్నాడని వల్లభనేని వంశీ ఆరోపించారు. నాలుక అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. శివ భరత్ రెడ్డి ఎక్కువగా మాట్లాడితే డొక్క పగలకొడతానని.. తాను పాలేరు తనం చేసింది ఆయన చూశాడా అని ప్రశ్నించారు. మల్లవల్లి లాండ్స్‌లో ఎవరు స్కాం చేశారో అందరికీ తెలుసన్నారు. షుగర్ ఫ్యాక్టరీ రైతులను మోసం చేస్తే చెప్పులతో కొట్టడానికి వచ్చిన విషయం మర్చిపోవద్దని హితవుపలికారు. వాళ్ళకంటే తాను ఎంత బలవంతుడినో నియోజకవర్గ ప్రజలకు తెలుసని.. రోడ్డు మీదికి వస్తే వంశీ అంటే ఏంటో చూపిస్తానని సవాల్ విసిరారు. గన్నవరంలో పుచ్చలపల్లి సుందరయ్య తరువాత వరుసగా రెండు సార్లు గెలిచిన ఎమ్మెల్యేను తానేనని స్పష్టం చేశారు. సీఎం జగన్ ఆదేశాల ప్రకారం గడప గడపకు తిరుగుతున్నానని పేర్కొన్నారు. ఉంగుటూరు మండలంలో సరిహద్దులు తెలియని వాళ్ళను జెడ్పీటీసీగా ఏకగ్రీవం చేశామని వల్లభనేని వంశీ అన్నారు.