Kishan Reddy: జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య స్వగ్రామం కృష్ణా జిల్లా మొవ్వ మండలం భట్ల పెనుమర్రులో కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, భాజపా నేతలు పర్యటించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా భట్ల పెనుమర్రు విచ్చేసిన కేంద్ర మంత్రి పింగళి వెంకయ్య, ఎన్టీఆర్ విగ్రహాలకు నివాళులర్పించారు. పింగళి వెంకయ్య మనవరాలు సుశీలను సత్కరించారు.
ఈ పర్యటనలో కేంద్ర మంత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి భట్లపెనుమర్రు గ్రామంలో పర్యటిస్తున్న సమయంలోనే జాయిట్ కలెక్టర్ వెళ్లి పోవడంతో కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్థుల సమస్యలపై మాట్లాడే సమయంలో జాయింట్ కలెక్టర్ ఎక్కడ? అంటూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. వెళ్లి పోయారంటూ ఇతర అధికారులు సమాధానమివ్వడంతో.. ఆయన అంత బిజీగా ఉన్నారా? అంటూ చమత్కరించారు. కేంద్రమంత్రి వచ్చినా ఉండరా? అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గ్రామంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని స్థానికులు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకురాగా.. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతానని, గ్రామంలో మౌలిక వసతులపై కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకుంటామన్నారు. రోడ్ల సమస్యను పరిష్కరించాలని అధికారులను కిషన్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు లేకపోతే ప్రధాని మోదీతో మాట్లాడి కేంద్రం నుంచి నిధులు ఇస్తానని హామీ ఇచ్చారు.
జాతీయ జెండాకు భట్లపెనుమర్రు గ్రామం ప్రాణం ఇచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ సందర్భంగా అన్నారు. సూర్య, చంద్రులు వున్నంత వరకు జాతీయ జెండా వుంటుందన్నారు. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య శతజయంతి సందర్భంగా ఆగస్టు 2న దిల్లీ వేదికగా పెద్ద ఎత్తున్న కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆయన స్మారకార్థం తపాలా బిళ్ల ఆవిష్కరణ, పింగళి రూపొందించిన జాతీయ జెండా ప్రదర్శన, అతని కుటుంబ సభ్యులతో ప్రధాని మోదీ భేటీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. భట్ల పెనుమర్రు గ్రామస్థులు కూడా ఆరోజు దిల్లీ రావాలని కోరారు. ఆగస్టు15న 75వ స్వాతత్ర్యదినోత్సవం ఘనంగా నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. పింగళి వెంకయ్య వంటి వారిని మరిచిపోతే చరిత్ర క్షమించదన్నారు. పల్లె నుంచి పట్నం వరకు ఆగస్టు 15న జాతీయ జెండా భారతీయుడి ఇంటి మీద ఎగురాలన్నారు. ఘంటసాల అమ్మమ్మ ఊరు ఇదే గ్రామం కావటం విశేషమని కేంద్ర మంత్రి తెలిపారు. ఘంటసాల ఒక గాయకుడే కాదు…స్వాతంత్య్ర సమరయోధుడని కీర్తించారు. ఘంటసాల జన్మదినోత్సవం కూడా ఘనంగా నిర్వహిస్తామన్నారు.
Kishan Reddy: ఆగస్టు 15న ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండా ఎగురవేయాలి
ఈ సందర్భంగా పింగళి వెంకయ్య మనుమరాలు సుశీల మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తమ పింగళి వెంకయ్య ఇంత గౌరవాన్ని ఇవ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇన్ని సంవత్సరాలకు వెంకయ్యకు న్యాయం జరిగిందన్నారు. ఆయన విగ్రహాలు ప్రతి నియోజకవర్గంలో పెట్టాలని ఆమె కోరారు. ప్రధాని పిలుపు మేరకు తాను ఢిల్లీ వెళ్తున్నానని ఈ సందర్భంగా తెలియజేశారు. తమ గ్రామంలో సరైన రోడ్లు లేవని.. గ్రామ అభివృద్ధి కోసం మోదీ, అమిత్ షాలతో మాట్లాడుతామన్నారు. వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలని ఆమె కోరారు.