NTV Telugu Site icon

టీటీడీ ఆఫర్.. వాళ్ళు ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు!

భారీవర్షాలు కారణంగా ఈ నెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు దర్శనం చేసుకోలేని భక్తులకు అవకాశం ఇచ్చింది టీటీడీ. అలాంటి భక్తులు రాబోయే ఆరు నెలలలో ఎప్పుడైనా స్వామి వారిని దర్శించుకోవచ్చు. ఇందుకు కోసం ప్రత్యేకంగా సాఫ్ట్ వేర్ రూపొందిస్తున్నామని, అందులో భక్తులు స్లాట్ ను బుక్ చేసుకోవచ్చన్నారు టీటీడీ అధికారులు.

వరదలు వల్ల తిరుమలలో రెండు ప్రదేశాలలోనే నష్టం జరిగింది…ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. భక్తులు నిర్భయంగా తిరుమలకు చేరుకొని స్వామి వారిని దర్శించుకోవచ్చు. ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడిన ప్రదేశాల్లో మరమ్మతులు పూర్తి చేశామన్నారు అదనపు ఈవో ధర్మారెడ్డి. నడకదారిన తిరుమలకు వచ్చే భక్తులను అలిపిరి కాలిబాట మార్గంలో అనుమతిస్తాం.

శ్రీవారి మెట్టు మార్గం కోతకు గురైంది. మరమ్మతులు పూర్తయిన అనంతరం ఈ మార్గంలో భక్తులను అనుమతిస్తాం. అప్పటివరకూ ఈ మార్గంలోకి భక్తులు రాకూడదన్నారు అదనపు ఈవో ధర్మారెడ్డి. ఈ నెల 25వ తేదీ నుంచి మళ్ళీ వర్షాలు వున్నాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటి నుంచే అప్రమత్తం అవుతున్నామన్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.