NTV Telugu Site icon

Tirumala: డ్రోన్ వీడియో ఫేక్.. అది పాత వీడియో అన్న ఈవో ధర్మారెడ్డి

Tirumala Drone Shots

Tirumala Drone Shots

Tirumala: తిరుమలలో డ్రోన్ కెమెరాలపై నిషేధం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా తిరుమల శ్రీవారి ఆలయ డ్రోన్ షాట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో తిరుమలలో డ్రోన్ కెమెరాలు ఎలా వినియోగించారని పలువురు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. శ్రీవారి ఆలయంపై డ్రోన్ కెమెరాలు ఎగరవేసినా విజిలెన్స్ విభాగం గుర్తించలేని స్థితిలో ఉందని పలువురు విమర్శలు చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలోని ఇన్ స్టాగ్రామ్ పేజీ ఐకాన్ అనే అకౌంట్ నుండి అప్ లోడ్ అయింది. అయితే ఈ వీడియో టీటీడీ దృష్టికి వెళ్లింది. దీంతో అప్రమత్తమైన టీటీడీ విజిలెన్స్‌ అధికారులు చర్యలు చేపట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: Ranji Trophy: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. 42 ఏళ్ల తర్వాత ముంబైపై ఢిల్లీ విజయం

అయితే ఈ డ్రోన్ వీడియోను హైదరాబాద్‌కు చెందిన వ్యక్తులు తీసినట్లు పోలీసులు గుర్తించారు. సోషల్ మీడియాలో వీడియోను అప్‌లోడ్ చేసిన వారిని అదుపులోకి తీసుకు విచారిస్తామని చెప్పారు. ఇప్పటికే నిందితులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అటు ఈ వీడియోపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించారు. అది ఫేక్ వీడియో అని స్పష్టం చేశారు. తిరుమలలో డ్రోన్‌లకు అసలు అనుమతి లేదని అన్నారు. తిరుమల ఎప్పుడూ సాయుధ బలగాల పర్యవేక్షణలో ఉంటుందని వెల్లడించారు. శ్రీవారి ఆలయంపై డ్రోన్లు ఎగురవేయడం అసాధ్యమని తెలిపారు. బహుశా అది 3డీ ఇమేజ్ లేదా గూగుల్ లైవ్ వీడియో అయ్యి ఉండొచ్చని ధర్మారెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ వీడియోను తెరపైకి తీసుకురావడం టీటీడీపై బురదజల్లే ప్రయత్నమేనని అన్నారు. పాత వీడియోను పట్టుకుని ఇప్పుడు జరిగిందని ప్రచారం చేయడం సరికాదన్నారు. ఇదే అంశంపై టీటీడీ సీవీఎస్‌వో నరసింహ కిషోర్ కూడా స్పందించారు. శ్రీవారి ఆలయానికి సంబందించిన ఈ వీడియోను డ్రోన్ కెమెరాతో తీశారా లేదా గూగుల్ నుండి సేకరించారా అన్నది ఫోరెన్సిక్‌కు పంపి నిర్ధారణ చేసుకుంటామని చెప్పారు.